తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటీ కానున్నది. ప్రగతిభవన్ లో జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలో లాక్ డౌన్, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయం సంబంధిత సీజనల్ అంశాలు, గోదావరిలో నీటిని లిఫ్టు చేసే అంశం, హైడల్ పవర్ ఉత్పత్తి తదితర అంశాలపై చర్చించనున్నారు.
మరోవైపు శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. మంత్రులు హరీశ్‌రావు, మహామూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్‌లు భేటీలో పాల్గొన్నారు. లాక్ డౌన్ సడలింపుతో పాటు ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలపై కీలకంగా చర్చించారు. లాక్‌డౌన్ ఇవాళే ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన ఉంటుందని అందరూ అనుకున్నప్పటికీ ఎలాంటి ప్రకటన రాలేదు. శనివారం మరోసారి భేటీ అయ్యి లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా, తెలంగాణలో విధించిన లాక్‌డౌన్ రేపటితో ముగియనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్ ఉంది. అయితే, 20 తర్వాత లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేయాలా ? లేదా నైట్ కర్ఫ్యూ మాత్రమే విధించాలా ? అనేదానిపై కేబినెట్ సమావేశంలో చర్చించి కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఢిల్లీ తరహా అన్‌లాక్‌కు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివిటి 1.36 శాతానికి తగ్గిన నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ ప్రభుత్వం అన్‌లాక్ చేసే విధంగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. జులై 1 నుంచి 50 శాతం వరకు ఆక్యుపెన్సీతో థియేటర్లు, బార్లు, జిమ్‌లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఇక, రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలకు ఎప్పుడో రంగం సిద్ధమైంది. ఈ మేరకు జాబితా కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరిందని, కేసీఆర్ సంతకమే తరువాయి అని ప్రభుత్వ వర్గాల సమాచారం. అదనపు బాధ్యతలు తొలగించి, ఒక్కో అధికారికి ఒకే ఒక్క ప్రధాన శాఖ అప్పగించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.