తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు నామినేషన్‌ల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పావుగా వాడుకుంటూ.. సీఎం అభ్యర్థి, అధిపతి అంటూ ప్రకటనలు ఇస్తోంది. బీజేపీ నేతలు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్‌ను ప్రచారానికి రావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 14న రత్నప్రభకు మద్దతుగా తిరుపతిలో బండి సంజయ్ ప్రచారం నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోంది. హార్డ్ కోర్ హిందుత్వ వాదిగా ముద్రపడ్డ బండి సంజయ్ టెంపుల్ సిటీ తిరుపతిలో ప్రచారానికి వస్తే మంచి మైలేజ్ దక్కుతుందని బీజేపీ భావిస్తోంది. గతంలో బైబిల్ పార్టీ కావాలో, భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోవాలంటూ ఒక్క మాటతో బండి సంజయ్ ఎన్నికల వాతావరణాన్ని మార్చేశారు. ఇప్పుడు అలాంటి హైప్‌ను ఏపీ బీజేపీ బలంగా కోరుకుంటోంది.
అయితే తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న తరుణంలో బండి సంజయ్ ప్రచారానికి వస్తే పొలిటికల్ హీట్ పెరిగే అవకాశం ఉంది. గతంలో పవన్-బండి సంజయ్ మధ్య జరిగిన పొలిటికల్ వార్ దీనికి కారణమయ్యే అవకాశముంది. తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికలతో మొదలైన ఈ వార్ తెలంగాణలో మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు కొనసాగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసేందుకు ఒప్పుకోని తెలంగాణ బీజేపీ చీఫ్.. ఇప్పుడు ఏపీలోని తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికి రావడాన్ని జనసేన నేతలు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పవన్ బీజేపీకి కాకుండా టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంపై బహిరంగంగానే బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు నేతల మధ్య వార్‌ను బీజేపీ ఎలా కంట్రోల్ చేస్తుందా అని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకోవడం ఆసక్తికరంగా మారింది.
ఇది ఇలా ఉండగా తిరుపతి ఉపఎన్నిక జరిగే ఏప్రిల్ 17నే నాగార్జున సాగర్ బై ఎలక్షన్ జరగాల్సి ఉండటంతో బండి సంజయ్ అసలు తిరుపతిలో ప్రచారానికి వెళ్తారా.. లేదా అన్న విషయం తేలాల్సి ఉంది.