Tuesday, November 26, 2024

ఆదాయం పెంచుకోవడంలో తెలంగాణ బెస్ట్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సబ్సిడీలు ఏయేటికాయేడు భారీగా పెరుగుతున్నా ప్రజా సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం వెనుకంజ వేయడం లేదు. సర్కార్‌ అనుసరిస్తున్న విధానాలతో స్వీయ రాబడిని పెంచుకుంటూ పథకాలకు ఆర్థిక లోటు రాకుండా జాగ్రత్త పడుతున్న ప్రభుత్వం అదేస్థాయిలో రాష్ట్ర ఎగుమతులు, సంపదను వృద్ధిపర్చేలా చర్యలు కొనసాగిస్తోంది. అందుకే కరోనా, ఆర్థిక మాంద్యం వంటి పరిస్థితులను అధిగమిస్తూ విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక, ఇతర ప్రజా సంక్షేమ పథకాలకు, రాయితీలకు, సబ్సిడీలకు ప్రభుత్వం ఏనాడూ వెనుకకు తిరిగి చూడటం లేదు. రాష్ట్ర సంపద పెంపులో, ఎగుమతులతో మారక ద్రవ్యం పెంచి పన్నుల ఆదాయం పెంచుకోవడంలో ”తెలంగాణ ది బెస్ట్‌” అని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

పలు నివేదికల ప్రశంసలు..
ఇప్పటికే వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఏడేళ్లలో తెలంగాణ సుస్థిర అభివృద్ధి దిశగా దూసుకుపోయిన తీరును కేంద్ర నివేదికలు ప్రశంసించాయి. నీతి ఆయోగ్‌, ఆర్బీఐ, ఇతర కేంద్ర సంస్థల నివేదికలు ఈ ఏడాదిలోనే పలు నివేదికల్లో తెలంగాణ జైత్రయాత్రను అక్షర నిక్షిప్తం చేశాయి. వ్యవసాయం రాష్ట్ర అభివృద్ధికి కీలక వనరుగా మారగా, రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు ఇస్తున్న చేయూతతో రాష్ట్ర సంపద రెండింతలకు చేరింది. దేశం నుంచి ఎగుమతి అవుతున్న మాంసంలో వృద్ధిరేటు పైపైకి ఎగబాకుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ పథకంతో పశుసంపద మూడు రెట్లకు పైగా పెరిగింది. 2014-15లో రాష్ట్రంలో పశుసంపద నికర విలువ రూ.29,282 కోట్లు కాగా, 2020-21 నాటికి రూ.94,211 కోట్లకు ఎగబాకింది. అదేస్థాయిలో రాష్ట్రం ఉత్పత్తి చేసే మాంసం విలువ మూడు రెట్లకు పైగా పెరుగుదల నమోదు చేసుకుంది. చేపలు, రొయ్యలు, గుడ్ల ఉత్పత్తి రెట్టింపు అయ్యింది. మత్య్ససంపద రాష్ట్రం ఏర్పడిన 2014 తొలినాళ్లలో రూ.2670 కోట్లు కాగా, తాజాగా ఇది రూ.5254 కోట్లకు పెరుగుదల నమోదు చేసుకున్నది. 2013-14లో 4.46 లక్షల మిలియన్‌ టన్నుల మాంసం ఉత్పత్తి జరగ్గా, 2019-20నాటికి ఇది 8.48 లక్షల టన్నులకు పెరిగి 90శాతంపైగా వృద్ధిరేటు కనబర్చింది.

సొంత వనరుల రాబడికి రాచబాటలు..
సొంత వనరుల రాబడిలో కూడా అప్రతిహత వృద్ధిరేటుతో దేశంలోనే తొలి స్థానంలో ఉండగా, అభివృద్ధి చెందినవిగా చెప్పుకుంటున్న రాష్ట్రాలేవీ ఈ ప్రగతిలో మనతో పోటీలో లేవు. 2014-15తో పోలిస్తే రాష్ట్ర స్వీయ వనరుల రాబడి 90శాతంపైగా పెరిగింది. వార్షిక సగటు వృద్ధి 11.52శాతంగా ఉంది. ఈ జాబితాలో 9.78 శాతంతో రెండో స్థానంలో ఒడిశా, 8.9శాతంతో మూడో స్థానంలో జార్ఖండ్‌లు ఉన్నాయి.

సబ్సిడీలకు జాప్యం లేకుండా..
అత్యంత కీలక రంగమైన విద్యుత్‌లో తెలంగాణ సొంత వృద్ధిని అనతి కాలంలో సాధించింది. దేశంలోనే వ్యవసాయరంగానికి 24 గం టలూ ఉచిత విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఎది గింది. 24.87 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్‌ అందిస్తూ, ఏటా రాయితీల రూపంలో రూ.10 వేల కోట్లు భరిస్తోంది. 2014-15 లో రాష్ట్రంలో 29519 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం ఉండగా, ఇప్పుడు ఏకంగా 58,515 మిలియన్‌ యూనిట్లకు చేరింది. తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలోనే ఐదో స్థానంలో ఉంది. సంస్థాగత విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 2014 జులైనాటికి 7778 మెగావాట్లు కాగా, ప్రస్తుతం 109శాతం వృద్ధిరేటుతో 16,249 మెగావాట్లకు పెరిగింది.

జాతీయ సగటుతో పోలిస్తే గడచిన ఏడేండ్లలో ప్రాథమిక రంగం, సేవారంగం, ద్వితీయ రంగాల్లో ముందంజలో ఉంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, అటవీ, పర్యావరణ, మత్య్స, ఆక్వాకల్చర్‌, మైనింగ్‌ వంటి రంగాలు 95శాతం ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ వీటిపై ఆధారపడిన ప్రజలకు ప్రభుత్వపరంగా మెరుగైన పథకాలు తెచ్చి సంపద సృష్టికి అండగా నిల్చారు. ఫలితంగా జీఎస్డీపీలో ప్రాథమిక రంగం వాటా 2014-15లో 19.5 వాతం ఉండగా, 2020-21కి 24.1శాతం చేరింది. ద్వితీయ రంగంలో కూడా జీఎస్డీపీలో 18శాతంతో 2020-21కి 72శాతం వృద్ధిరేటు కనబర్చింది. సేవారంగంలో రాష్ట్ర జీఎస్డీపీ ఈ ఏడాదిలో 59.5శాతం వాటా చోటుచేసుకుంది. 2014కు 2020కి మధ్య 80శాతం వృద్ధితో రూ.2,86,011 కోట్ల నుంచి రూ.5,39,230 కోట్లకు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement