తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమై.. సోమవారానికి వాయిదా పడ్డాయి. తొలిరోజు ఇటీవల మరణించిన 9 మంది మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ సభ్యులందరూ నిబంధనలు పాటించాలని స్పీకర్ సూచించారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేశారు. అటు శాసనమండలిలో ప్రొటెం ఛైర్మన్ హోదాలో సంతాప తీర్మానాన్ని భూపాల్ రెడ్డి చదివి వినిపించారు. శాసనమండలి కూడా సోమవారానికి వాయిదా పడింది.
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం, కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే మేనేని సత్యనారాయణ రావు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం, మాజీ ఎమ్మెల్యేలు రాజయ్యగారి ముత్యం రెడ్డి, బొగ్గారపు సీతారామయ్య, చేకూరి కాశయ్యల మృతి పట్ల అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. సంతాప తీర్మానాల అనంతరం ఉభయ సభలుసోమవారానికి వాయిదా పడ్డాయి.
కాగా, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం కొనసాగుతున్నది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులపాటు నిర్వహించాలి, ఏయే అంశానికి ఎంత సమయాన్ని కేటాయించాలనే విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఇది కూడా చదవండి: వెదర్ రిపోర్ట్: తెలంగాణకు వర్ష సూచన