ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ చేసిన రాజీనామా స్పీకర్ ఆమోదం పొందడంతో హుజురాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నికల జరగనుంది. హుజురాబాద్ సీటు ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ గెజిట్ విడుదల చేశారు. శనివారం ఈటల తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి పంపించగా, ఆయన వెంటనే ఆమోదించారు. ఈటల రాజీనామా ఆమోదంతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈటల రాజీనామాపై ఎన్నికల సంఘానికి సమాచారం అందించారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారి ఎన్నికల సంఘానికి నివేదించారు. త్వరలోనే దీనిపై ఈసీ నిర్ణయం తీసుకుని ఉపఎన్నిక ప్రకటన చేయనుంది.
సాధారణంగా ఓ సభ్యుడు రాజీనామా చేసినప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఆ సభ్యుడితో మాట్లాడాల్సి ఉంటుంది. అయితే ఈటల విషయంలో మాత్రం ఆ విధంగా జరగలేదు. ఇక, ఈటల రాజీనామాతో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ ఏర్పడడంతో ప్రధాన పార్టీలు ఉప ఎన్నికలపై దృష్టి పెట్టుందుకు సిద్దమవుతున్నాయి. బీజేపీ అభ్యర్థిగా ఈటల బరిలో దిగనున్నారు. అయితే, టీఆర్ఎస్ తరుపున ఎవరు ఉంటారు ? అనేది ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.