తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ జరగనున్నాయి. వర్షాకాల సమావేశాల్లో నేటి నుంచి పూర్తి స్థాయి అజెండాపై చర్చ జరగనుంది. ఇవాళ్టి నుంచి ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలనూ చేపట్టనున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ రంగ పురోగతిపై శాసనసభలో ఇవాళ చర్చ జరగనుంది. గృహనిర్మాణ సంస్థ, ఉద్యానవన విశ్వవిద్యాలయం, పంచాయతీరాజ్, నల్సార్ చట్టసవరణ బిల్లులు అసెంబ్లీ ముందుకు రానున్నాయి.
హైదరాబాద్లో వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రాజెక్టు పనులు, మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు, ఉస్మానియా ఆస్పత్రిలో జంట టవర్ల నిర్మాణం, గొర్రెల యూనిట్ల పంపిణీ, రాష్ట్రంలో జనపనార మిల్లుల ఏర్పాటు, కొత్త జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అంశాలు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావనకు రానున్నాయి. శాసనమండలిలో ఇవాళ కేవలం ప్రశ్నోత్తరాలు మాత్రమే చేపడతారు. కాగా, అక్టోబర్ 5 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.