తెలంగాణలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ముందుగా 9 మంది మాజీ శాసన సభ్యులకు సంతాపం తెలియజేయనున్నారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. ఇక సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగే BAC సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఈ సారి అసెంబ్లీ సెషన్స్ వారం పాటు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే… నెల రోజుల పాటు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఐదుకు పైగా బిల్లులను ఆమోదింపజేయాలనే ఆలోచనతో ఉంది KCR ప్రభుత్వం. ఇందులో దళిత బంధుకు సంబంధించిన చట్టం కూడా ఉంటుందని తెలుస్తోంది. అటు విపక్షాలు కూడా దళితబంధుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటున్నాయి. బడ్జెట్లో నిధులు కేటాయించకుండా, రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని ఎలా అమలు చేస్తారో చెప్పాలని ప్రశ్నిస్తామంటోంది కాంగ్రెస్.
అలాగే, వివిధ ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ జరగాలంటోంది. ఆసరా పెన్షన్స్ పంపిణీలో జాప్యంపై గళమెత్తాలని నిర్ణయించింది బీజేపీ. దళిత బంధు పథకం అమలు తీరు, నిరుద్యోగ భృతితో పాటు ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటోంది. రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న డ్రగ్స్ అంశంతో పాటు ఉద్యోగ నియామకాలపైనా TRS ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యాయి విపక్ష పార్టీలు. దీంతో తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ వాడివేడిగా సాగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: దొరగారి పాలనలో గల్లీకో వైన్స్, వీధికో బార్: షర్మిల