హైదరాబాద్, ఆంధ్రప్రభ: సమాజంలో సానుకూల మార్పుల కోసం సాంకేతికతను ఉపయోగించుకుంటూ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును అమలు చేయటంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే టార్చ్ బేరర్‌గా నిలవనుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖా మంత్రి కేటీ. రామారావు పేర్కొన్నారు. పౌరులందరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించే కార్యక్రమం తెలంగాణలో దిగ్విజయంగా అమలవుతోందని పేర్కొన్నారు. ఈ విషయమై తన అధికారిక ట్విట్టర్లో ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. పైలట్ మోడ్‌లో రాష్ట్రంలోని సిరిసిల్ల రాజన్న జిల్లా, ములుగు జిల్లాల్లో డిెజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ దిగ్విజయంగా కొనసాగుతుండడంపై #హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశానికి మార్గనిర్దేశకంగా నిలవనుందన్నారు. ములుగు, సిరిసిల్ల జిల్లా ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసేందుకు ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు తనిఖీలు నిర్వహిస్తున్న ఫోటోలను ట్వీట్‌కు ట్యాగ్ చేశారు. భారతదేశంలోనే మొదటి సారిగా ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రం పౌరుల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఇది విప్లవాత్మకమైన నిర్ణయమని వైద్య నిపుణులు ప్రశంసిస్తున్నారు. ప్రాజెక్టును ముందుగా పైలట్ మోడ్‌లో ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో అమలు చేస్తున్నారు. భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్‌గా పేరొందిన ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది మార్చి 5 న రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు ములుగులో, మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాల్లో లాంచనంగా ప్రారంభించారు.
డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం పైలట్ మోడ్‌లో రెండు జిల్లాలకే పరిమితమైన హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును పైలట్మోడ్లో భాగంగా 40 రోజుల్లోగా పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టు అమలులో భాగంగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లోని ఆశా వర్కర్లు ప్రతీ రోజూ ఇంటింటికి తిరుగుతూ ప్రత్యేక వైద్య బృందాల సహకారంతో ప్రజల ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నారు. ప్రతి వ్యక్తికి కనీసం 30 వైద్య పరీక్షలు నిర్వ#హస్తున్నారు. ఆ తర్వాత తదుపరి వైద్య చికిత్సల కోసం వారికి డిజిటల్ హెల్త్ కార్డు ఇవ్వనున్నారు. బీపీ, షుగర్, మూత్ర, రక్త పరీక్షలు చేస్తూ పౌరుల ఆరోగ్య వివరాలను సేకరించి డిజిటల్ రూపంలో పొందుపరుస్తున్నారు. ఏదైనా ప్రమాదం లేదా అత్యవసర అనారోగ్య పరిస్థితుల్లో వ్యక్తులకు తక్షణ ఆరోగ్య సంరక్షణ అందించేందుకు ఈ డేటాను ఉపయోగించనున్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఏ వ్యాధులు ఎక్కువగా విజృంభిస్తున్నాయి, వాటిని కట్టడి చేయటం ఎలా అన్న వ్యూహాలను ప్రభుత్వం రూపొందించేందుకు ఈ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు ఉపయోగపడనుంది.