హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న విత్తనాలు దేశంలోని 16 రాష్ట్రాలతోపాటు ప్రపంచ దేశాలకూ ఎగుమతి అవుతున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రపంచ విత్తన భాండాగారంగా ఎదుగుతోందని ప్రకటించారు. తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం (టీఐఎస్‌టీఏ) – రాజేంద్రనగర్‌లో 5రోజులపాటు నిర్వహించనున్న అంతర్జాతీయ విత్తన పరీక్ష వర్క్‌షాప్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… వ్యవసాయంలో విత్తన ఎంపికే కీలకమన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయరంగానికి ప్రాధాన్యత ఇచ్చి దేశానికే ఆదర్శవంతమైన విధానాలు అమలు చేస్తున్నారని కొనియాడారు.
రైతు బంధు, రైతు భీమా, వ్యవసాయానికి ఉచిత కరెంటు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. వ్యవసాయంలో విత్తనాన్ని ప్రముఖ అంశంగా భావించి విత్తన రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి , తెలంగాణను ప్రపంచ విత్తన భాండాగారంగా తీర్చి దిద్దడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర విత్తన పరీక్షా కేంద్రంలో మొదటిసారిగా అంతర్జాతీయ స్థాయి విత్తన పరీక్ష వర్క్‌షాప్‌ను నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. విత్తనోత్పద్దిదారులకు, ప్రభుత్వరంగ సంస్థలకు ఈ తరహా వర్క్ షాప్‌లు విత్తనరంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకే దోహదం చేస్తుందన్నారు.
తెలంగాణ విత్తన పరీక్షా కేంద్రంలో అత్యాధునిక సదుపాయాలు కల్పించామన్నారు. అంతర్జాతీయ విత్తన నిపుణులు ఎడ్జీ గోల్డ్ శాగ్ మాట్లాడుతూ… తెలంగాణలో నాణ్యమైన విత్తనోత్పత్తికి మంచి అవకాశాలు, సదుపాయాలు ఉన్నాయని, ప్రభుత్వ సహకారం కూడా ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ కేశవులు, టాంజానియా, కెన్యా, ఇండోనేషియా తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.