Saturday, November 23, 2024

పౌల్ట్రీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ : మంత్రి కేటీఆర్‌

పౌల్ట్రీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ రాష్ట్రం ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ఫుడ్‌ కాంక్లేవ్‌ – 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‎తో కలిసి మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. పెట్టుబడులకు తెలంగాణలో అపార అవకాశాలున్నాయని అన్నారు. గత తొమ్మిదేండ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఐదు రెవల్యూషన్స్ తీసుకొచ్చిందన్నారు. తెలంగాణ సీడ్ బాల్ ఆఫ్ ఇండియాగా ఎదుగుతున్నదని చెప్పారు. మత్స్య సంపదలో దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉన్నామని తెలిపారు. హార్టికల్చర్, డైరీ రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంద‌న్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం, హార్టికల్చర్ విశ్వవిద్యాలయం, వెటర్నరీ వర్సిటీ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గత ఐదేండ్లుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ కితాబిచ్చారు. దళితబంధు పథకం కింద ఇస్తున్న రూ.10లక్షలతో నలుగురు కలిసి రూ.40 లక్షలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. చిన్న, మధ్యతరగతి పారిశ్రామికవేత్తలను ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. తెలంగాణలో ఉత్తర, దక్షిణ భారతదేశానికి చెందిన ప్రజలు పనిచేస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తాము తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ టీఎస్ ఐపాస్ పనితీరు చాలా బాగుందని, రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే నేరుగా ఎవరినీ కలవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేస్తే 15 రోజుల్లోనే కంపెనీ ఏర్పాటుకు అనుమతులు వస్తాయని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం యూనిట్లు ఏర్పాటు చేస్తే అందుకు కావాల్సిన ముడిపదార్థాలను గ్రామీణ ప్రాంతాల నుంచి అందించేందుకు అధికారులు సహకారం అందిస్తారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement