Saturday, November 23, 2024

దేశానికి రోల్‌మోడల్‌గా తెలంగాణ.. లండన్‌లో ఇండియాన్‌ డయాస్పోరా భేటీలో కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ఒక రోల్‌మోడల్‌గా నిలుస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ అన్నారు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ఉన్న సంక్షోభ పరిస్థితులను దాటుకొని పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా మారడానికి పరిపాలనలో తీసుకువచ్చిన సంస్కరణలే కారణమన్నారు. యూకేలో పర్యటనలో భాగంగా నాలుగవ రోజు శుక్రవారం లండన్‌లోని హై కమిషన్‌ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. లండన్‌లోని నెహ్రూసెంటర్‌లో జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ భారత్‌ ప్రపంచంతో పోటీపడి ముందుకు పోవాలంటే అద్భుతమైన విప్లవాత్మకమైన పాలనా సంస్కరణలు అవసరమన్నారు. ప్రపంచమంతా జనాభా వృద్ధాప్యంవైపు నడుస్తుంటే భారత్‌లో అత్యధికంగా జనాభా యువతేనని చెప్పారు. ఒకవైపు పాలనా సంస్కరణలు పెట్టుబడులకు స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తేనే దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతామని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.

కేవలం పెట్టుబడులే కాకుండా ప్రజలకు అత్యంత అవసరమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణలో చేపడుతున్నామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ఇరిగేషన్‌ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ప్రాజెక్టును అతి తక్కువ సమయంలోనే నిర్మించిన తీరును వివరించగా సమావేశానికి హాజరైన వారు పెద్ద ఎత్తన చప్పట్లతో అభినందించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలు కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాదని అవి భారతదేశ విజయాలుగా పరిగణించి ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా వివిధ దేశాల్లో ఉన్న భారత ఎన్నారైలు ఈ విజయాలను ప్రపంచానికి చాటేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్య, ఉపాధి, దేశంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఆర్ధికాభివృద్ధి వంటి అనేక అంశాలపై సమావేశానికి హాజరైన వారి ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానాలిచ్చారు. బ్రిటన్‌లో భారత డిప్యూటీ హై కమిషనర్‌ సుజిత్‌ జొయ్‌ ఘోష్‌, నెహ్రూ సెంటర్‌ డైరెక్టర్‌ అమిష్‌ త్రిపాటి, ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చాగోష్టిలో భారత్‌, బ్రిటన్‌కు చెందిన పలువురు కీలక వ్యాపారవేత్తలు ఇండియన్‌ డయాస్పోరా ముఖ్యులుహాజరయ్యారు. ఈ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడిన తీరుకు ముగ్ధులైన పలువురు పారిశ్రామికవేత్తలు వ్యక్తిగతంగా కేటీఆర్‌ను కలిసి అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement