Sunday, November 17, 2024

ఫార్మా హబ్‌గా తెలంగాణ.. బయో ఏషియా సదస్సులో బిల్‌గేట్స్‌తో కేటీఆర్ చ‌ర్చ‌..

హైదరాబాద్‌ ప్రపంచ ఫార్మా హబ్‌గా మారిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలశాఖ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం ఆయన బయో ఏషియా సదస్సులో భాగంగా మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో ‘ఫైర్‌ సైడ్‌ చాట్‌’లో పాల్గొని.. కొవిడ్‌ సవాళ్లు, ఆరోగ్య రంగంలో వచ్చిన మార్పులు, లైఫ్‌సైన్సెన్స్‌ రంగ భవిష్యత్‌పై బిల్‌గేట్స్‌తో కేటీఆర్‌ చర్చించారు. భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు? కరోలాంటి వాటిని ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈ సందర్భంగా బిల్‌గేట్స్‌ మాట్లాడుతూ కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు భారత్‌ వేగంగా స్పందించిందన్నారు. కరోనాకు వేగంగా వ్యాక్సిన్‌ తయారు చేశారంటూ ప్రశంసించారు. నిమోనియా, టైఫాయిడ్ వ్యాధులపై ఇప్పటికీ పరిశోధన కొనసాగుతూనే ఉందన్న ఆయన.. భవిష్యత్‌లో కరోనాలాంటి వైరస్‌లు మరిన్ని దాడి చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

ఫార్మా టెక్నాలజీ ఖర్చుతో కూడుకున్నదని, కరోనా వ్యాక్సిన్ ధరలు భారత్‌లో అందరికీ అందుబాటులో ఉన్నాయన్నారు. కొత్త టెక్నాలజీని వాడుకుంటూ వేగంగా మందులు తయారు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాత్రికి రాత్రి ఏది మనం తయారు చేయలేమని, ఇందుకు కొంత సమయం పడుతుందన్నారు. భారతదేశంలో వ్యాక్సిన్ పంపిణీని శరవేగంగా నిర్వహించారంటూ బిల్‌గేట్స్‌ ప్రశసించారు. కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికించిన కరోనాను కట్టడి చేసే రెండు వ్యాక్సిన్లు హైదరాబాద్‌లోనే తయారయ్యాయని తెలిపారు. మెడిసిన్స్ తయారు చేయడం అన్నది నిరంతరం జరిగే ప్రక్రియ అనీ, ఛాలెంజ్‌తో కూడుకున్నదన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గతంలో మీరు(బిల్) వచ్చిన హైదరాబాద్ వేరని.. ఇప్పుడున్న హైదరాబాద్ వేరని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ నగరంలో ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement