Tuesday, November 26, 2024

Telangana | ఈవీల తయారీ హబ్‌గా తెలంగాణ.. అద్భుత పాలసీతో పెట్టుబడుల వరద: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : విద్యుత్‌ వాహనాల తయారీ, పరిశోధన కేంద్రంగా తెలంగాణ మారబోతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పురోగామ విధానాలు, 24 గంటల విద్యుత్‌తో ఇప్పటికే తెలంగాణ ఎలక్ట్రిఫైడ్‌ రాష్ట్రంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో ఈవీ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. మొబిలిటీ వీక్‌లో భాగంగా హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో హైదరాబాద్‌ ఈ మోటార్‌ షో 2023ను మంత్రి కేటీఆర్‌ బుధవారం ప్రారంభించారు. పలు ఈవీ కంపెనీల స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ షో లో ఎలక్ట్రిక్‌ బైక్స్‌, కార్‌లు, కమర్షియల్‌ వాహనాలు, టైర్‌ కంపెనీలు, ఈవీ బ్యాటరీ, ఈవీ స్టార్టప్‌ కంపెనీలు పాల్గొన్నాయి. ఇక్కడ ఈవీ వాహనాల రంగానికి చెందిన ఉత్పత్తుల తయారీ, పరిశోధన చేయడానికి సమగ్ర వ్యూహంతో ముందుకు వెళుతున్నామన్నారు.

హైదరాబాద్‌ ఈ మోటార్‌ షోలో దేశీయ కంపెనీల ఎలక్ట్రిక్‌ వాహనాలతో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇది మొదటి అడుగు మాత్రమేనని, రానున్న రోజుల్లో ఈవీ రంగం అభివృద్ధి మరింతగా చెందుతుందన్నారు. ఈవీ బ్యాటరీ తయారీ కంపెనీ అమర్‌ రాజా సంస్థ ఇప్పటికే తమ వస్తువులను తయారు చేసే యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటును ఇటీవలే ప్రకటించామన్నారు. రానున్న రోజుల్లో ఈ రంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈవీ పాలసీతో ఇప్పటికే రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయన్నారు. రెన్యువబుల్‌ ఎనర్టీ రంగంలో తెలంగాణ ఇప్పటికే ముందంజలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎలక్ట్రానిక్స్‌ డైరెక్టర్‌ సుజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రదర్శన తిలకించి పలు ఈవీ కార్లు ప్రారంభించిన మంత్రి…
ఈ మోటార్‌ షో ప్రదర్శన తిలకించిన మంత్రి పలు ప్రముఖ కంపెనీలకు చెందిన ఈవీ కార్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సిట్రోయెన్‌ కంపెనీకి చెందిన ఈసీ3, క్వాంటమ్‌ ఎనర్జీ, ఈవీ ప్లాస్మా, హాప్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీలకు చెందిన 2 వీలర్లను మంత్రి ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement