Friday, November 22, 2024

Telangana – రిజ‌ర్వాయ‌ర్ల‌లో డెడ్ స్టోరేజీ … తాగు నీటికి కటకట ..

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్‌- ప్రభ న్యూస్ బ్యూరో జూన్ నెల సగం దాటిపోయింది.. ప‌రివాహ‌క ప్రాంతంలో వ‌ర్షాలు జాడ లేదు. దీనికి తోడు జ‌లాశ‌యాల్లో నీటి నిల్వ‌లు పూర్తిగా ప‌డిపోయాయి. శ్రీ‌రాంసాగ‌ర్‌, నాగార్జున‌సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ల‌లో నీటి మ‌ట్టం దిగ‌జారిపోయింది. అలాగే నిజాంసాగ‌ర్‌, మిడ్ మానేరు పూర్తిగా ఎండిపోయింది. ప్ర‌స్తుతం అన్ని జ‌లాశ‌యాల్లో డేడ్ స్టోరేజీగా అధికారులు గుర్తిస్తున్నారు. ఖ‌రీఫ్ సాగు ముందుకు వెళ్ల‌డం లేద‌ని ఆయ‌క‌ట్టుదారులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. రిజ‌ర్వాయ‌ర్ ప‌రిస‌ర ప్రాంతాల ప్ర‌జ‌లు నీటి క‌ష్టాలు ఎదుర్కొంటున్నారు. మిడ్ మానేరు జ‌లాశ‌యంలో నీరు లేక‌పోవ‌డంతో ఇళ్ల గోడ‌ల శిథిలాలు క‌నిపించ‌డంతో నిర్వాసితులు గ‌త వైభ‌వం గుర్తు చేసుకుంటున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మన్వాడ గ్రామంలో మానేరు నదిపై మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మించారు. 2005లో ప్రారంభ‌మైన‌ పనులు 2018 ఏప్రిల్ 4 నాటికి పూర్తైంది. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు అనుసంధానంగా ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టులో 25.8 టీఎంసీల నీటి నిల్వ సామ‌ర్థ్యం ఉంది. ప్ర‌స్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ‌లు కేవ‌లం నాలుగు టీఎంసీలు ఉన్నాయి. అటు కాళేశ్వరం నుంచి నీరు రాక పోవ‌డం, ప‌రివాహ‌క ప్రాంతంలో వ‌ర్షాలు లేక ఇన్‌ఫ్లో లేక‌పోవ‌డంతో నీటి నిల్వ‌లు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టు కింద సుమారు రెండు ల‌క్ష‌లు ఆయ‌క‌ట్టు ఉంది. మిష‌న్ భ‌గీర‌థ కింద‌ 40 క్యూసెక్కుల నీరు వినియోగిస్తున్నారు. దీంతో సిరిసిల్ల వాసుల దాహార్తి తీరుతోంది. రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో ప‌డిన వ‌ర్షాలు త‌ప్ప ఆ త‌ర్వాత జాడ‌లేదు. ఖ‌రీఫ్ లో వేసిన విత్త‌నాలు ఏమ‌వుతాయో అని రైతులు, తాగు నీరు అందుతుందో లేదో అని సిరిసిల్ల గ్రామ‌స్థులు ఆందోళ‌న చెందుతున్నారు.

- Advertisement -

రిజ‌ర్వాయ‌ర్ గ‌ర్భంలో శిథిలాలు
మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణ స‌మ‌యంలో 12 గ్రామాలు ముంపున‌కు గుర‌య్యాయి. నీలోజిపల్లి, శాభాష్ పల్లి, అనుపురం, రుద్రవరం, కొడిముంజ, చీర్లవంచ, చింతల్ ఠాణా, గుర్రవాణిపల్లె, ఆరెపల్లి, సంకెపల్లి, కొదురుపాక, వరదవెల్లి గ్రామాలు ముంపునకు గురైన సంగ‌తి విదిత‌మే. అయితే ఆ ప్రాజెక్టులో నీరు ఎండిపోవ‌డంతో ఆ గ్రామాల ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ఇళ్లు, స్కూళ్ల గోడ‌ల శిథిలాలు ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఆ శిథిలాలు చూసిన ఆయా గ్రామ‌స్థులు గ‌త వైభ‌వం గుర్తు చేసుకుంటున్నారు. ఉమ్మ‌డి జిల్లాల్లో ఉన్న ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. వ‌ర్షాలు ప‌డ‌కుంటే నీటి క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని ఆయ‌క‌ట్టుదారులు, ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

శ్రీ‌రాంసాగ‌ర్‌లో అడుగంటిన జ‌లాలు
నిజామాబాద్ జిల్లాలో వ‌ర్షాలు మొఖం చాటేయ‌డంతో ప్ర‌ధాన జ‌లాశ‌యాలు నీటి మ‌ట్టాలు దిగ‌జారిపోయాయి. నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నాయి. శ్రీరాంసాగర్ లో కేవలం 7 టీఎంసీల‌ నీరు మాత్రమే నిల్వ ఉంది. శ్రీరాంసాగర్ జలాశయపు నీటిమట్టం గరిష్ఠ ఎత్తు 1091 అడుగులు అంటే రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 112 టీఎంసీలు. శ్రీ‌రాంసాగ‌ర్ నుంచి తాగునీటి కోసం మిషన్ భగీరథ ద్వారా కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, అదిలాబాద్ జిల్లాలకు 400 వందల క్యూసెక్కుల నీటిని నిరంతరం విడిచి పెడుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పై ఆధారపడి సుమారు 50 కి పైగా ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. శ్రీ‌రాంసాగ‌ర్ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిమ‌ట్టం పెరిగితే త‌ప్పా తాగు, సాగు నీటి స‌మ‌స్య ప‌రిష్కారం కాదు.

ఎడారిని త‌ల‌పిస్తున్న‌ నిజాంసాగ‌ర్
నిజాంసాగర్‌లో చుక్క నీరు లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టుల నుంచి సాగునీటిని విడుదల చేసే అవకాశం ఏమాత్రం లేదు. నిజాంసాగ‌ర్ పూర్తి స్థాయి నీటి నిల్వ‌లు 17.80 టీఎంసీలు. ప్ర‌స్తుతం చుక్క నీరు లేక‌పోవ‌డంతో ఎడారిలా త‌ల‌పిస్తుంది.

సాగ‌ర్ లో అడుగంటిన నీరు
నాగార్జున సాగర్ లో నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. ఓ వైపు వర్షాలు కురుస్తున్నా సాగర్‌లోకి నీరు రావడం లేదు. కృష్ణా బేసిన్‌లో ఇన్‌ఫ్లో అంతంత మాత్రంగానే ఉండడంతో ఇప్పటి వరకు నాగార్జున సాగర్‌కు నీరు వచ్చింది లేదు. నాగార్జున సాగర్‌ నీటిసామర్థ్యం 319 టీఎంసీలకు గాను, ప్రస్తుతం కేవలం 122 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీనిని ఇరిగేష‌న్‌ అధికారులు డెడ్‌ స్టోరేజ్‌గా పరిగణిస్తారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు తాగు నీటికి అత్యవసర పరిస్థితులు వస్తే, 490 అడుగుల నీటిమట్టంలోనూ రైట్ కెనాల్ కు నీరు వదిలే అవకాశం ఉంది. కృష్ణా రివర్ బోర్డు జోక్యం చేసుకుంటే తప్ప కిందకి నీరు వదల్లేమని అధికారులు చెబుతున్నారు. కర్ణాటక , మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో నాగార్జున సాగర్ కు నీరు వచ్చే అవకాశం లేదని, సాగునీటి విడుదలకు అవకాశాలు లేవ‌ని అధికారులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం నాగార్జున సాగర్‌లో నీరు లేక‌ వెలవెలబోతోంది. దీంతో, సాగర్ ప‌రిస‌ర ప్రాంతాల్లో నీటి స‌మ‌స్య త‌ప్ప‌డం లేదు.

కడెం ప్రాజెక్టు…
గత ఏడాదితో పోలిస్తే ఈ సారి వర్షపాతం అధిక లోటు కారణంగా రిజ‌ర్వాయ‌ర్ల‌కు నీరు చేర‌డం లేదు. కడెం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.35 టీఎంసీలకు పడిపోయింది. కడెం జలాశయం డెడ్ స్టోరేజీతో నీటి చుక్క లేక బోసిపోయింది. ఎల్లంపల్లి జలాశయం ఈ సారి దయనీయంగా మారింది. కాళేశ్వరం ఎత్తిపోతల నుంచి నీటి తరలింపు నిలిచిపోవడంతో ఎల్లంపల్లి జలాశయం అడుగంటింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement