దేశంలో అన్ని రాష్ట్రాల జీఎస్డీపీలో అప్పుల పరిమితిలో చూస్తే తెలంగాణ ఉత్తమ స్థితిలో ఉంది. 2016-17లో ఉత్తమ స్థానంలో తెలంగాణ జీఎస్డీపీలో 12.43శాతం అప్పుల పరిమితిలో ఉండగా, మిజోరం అట్టడుగులో 51.87శాతం అప్పులు తీసుకుంది. 2018-19లో మరోసారి తెలంగాణ ఉత్తమ స్థానంతో 15.60శాతంతో అప్పుల పరిమితికి లోబడి ఉండగా, ఒడిశా అట్టడుగున నిల్చింది. ఈ మేరకు దేశంలోని పలు రాష్ట్రాల అప్పుల స్థితిగతులపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కలిపి జీడీపీలో 350శాతం పైబడి అప్పుల్లో ఉండగా, తెలంగాణ అత్యుత్తమంగా ఉందని రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏడేళ్లలో పెట్టుబడి వ్యయం నాలుగు రెట్లు పెరిగింది. పెట్టుబడి వ్యయం 2014-15లో రూ.11,583 కోట్లు ఉండగా, 2020-21 నాటికి రూ.44,145 కోట్లకు పెరిగింది. ఈ పెరుగుదల 83.81 శాతంగా ఉంది. సామాజిక సేవా రంగంలో వ్యయం ఏడేళ్లలో 3.44 రెట్లు పెరిగింది. నవంబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.81,883 కోట్లు రెవెన్యూ వ్యయాలు పూర్తి చేసింది. అయితే మూలధన వ్యయంలో దేశం సగటు కంటే తెలంగాణ ముందంజలో ఉంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.5.13 లక్షల కోట్ల మూలధన వ్యయాలు పేర్కొని తొలి ఆరు మాసాల్లో రూ.2.09 లక్షల కోట్లే ఖర్చు చేసింది. ఇది 41శాతంగా పరిమితమైంది. కానీ తెలంగాణ రాష్ట్రం 51.91శాతం మూలధన వ్యయాలతో దేశంలోనే ముందువరుసలో నిల్చింది.
మూలధన వ్యయం రూ.కోట్లలో….
2014-15 11,583
2015-16 21,556
2016-17 40,253
2017-18 34,661
2018-19 38,239
2019-20 21,228
2020-21 44,145
అదేవిధంగా 2015-16 ఆర్థిక ఏడాది నుంచి వార్షిక వృద్ధిరేటు ఏనాడూ తగ్గకుండా 9శాతం కంటే ఎక్కువగా నమోదు చేసుకుంటోంది. ఇందులో జీఎస్డీపీలో వ్యవసాయరంగం వాటా 16శాతం ఉండగా, పారిశ్రామిక రంగం వాటా 17శాతంగా ఉంది.
వివరాలు రంగాల వారీగా…
రంగం 2014-15 2020-21
జీఎస్డీపీ రూ.5,05,849 కోట్లు 980407కోట్లు
తలసరి ఆదాయం 1,24,104 2,37,632
సొంత వనరులు 35,146 కోట్లు 66648 కోట్లు
వ్యవసాయ వృద్ధి 2శాతం 16.5శాతం
వ్యవసాయ, ఫిషింగ్ 76,123 కోట్లు 1,84,321 కోట్లు
వరి 9,528 కోట్లు 47,440 కోట్లు
పత్తి 7,549 కోట్లు 19,025 కోట్లు
రాగులు 530 కోట్లు 3,808 కోట్లు
విద్యుత్, నీరు 7,340 కోట్లు 16,871 కోట్లు
మైనింగ్ 14,706 కోట్లు 31,963 కోట్లు
విద్యుత్ వినియోగం 39519 మి.యూనిట్లు 58515ఎంయూ
సేవల రంగం 2,86,011 కోట్లు 5,33,230 కోట్లు
ఐటీ రంగం వృద్ధి 13.27శాతం 12.98శాతం
వ్యవస్థాపిత విద్యుత్ 7,778 మెగావాట్లు 16,931మెగావాట్లు
2019-20లో 4.63 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను తెలంగాణ ఎగుమతి చేయగా, ఐటీ రంగంలో వృద్ధిరేటును కనబరుస్తూ అగ్రశ్రేణిలో నిలుస్తోంది. అయితే కేంద్ర పన్నుల్లో వాటా తగ్గుతోందని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదని నిజమేనని తేలింది. 2019-20 ఆర్థిక ఏడాది వాస్తవిక వ్యయంతో పోలిస్తే 2020-21 ఆర్థిక ఏడాదిలో 13శాతం అధికంగా వ్యయం చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిల్చింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలకు, ఇతర ఖర్చులకు నిధులను ఏ మాత్రం కోత పెట్టడం లేదని స్పష్టమైంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..