పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన బయలుదేరిన విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా వెంటనే ఆ విమానాన్ని వెనక్కి తీసుకొచ్చి ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) నాయకుడు అజర్ మశ్వానీ స్పష్టం చేసినట్లు పాకిస్తాన్ ఆధారిత వార్తాపత్రిక ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది.
ఇమ్రాన్ ఖాన్ ఒక బహిరంగ సభలో ప్రసంగించేందుకు పంజాబ్‌లోని గుజ్రాన్‌వాలా సిటీ వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయని, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం వల్ల ఆయన విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్నారని మీడియా కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ రోడ్డు మార్గంలో గుజ్రాన్‌వాలాకు వెళ్లిపోయినట్టు సమాచారం.