న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గత ఏడాది జులైలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేని ప్రాజెక్టుల జాబితాలో ఉన్న మూడు ప్రాజెక్టులకు మంగళవారం టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మూడు ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఆమోదం పొందిన ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
- ముక్తేశ్వర (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం (భూపాలపల్లి జిల్లా)
- ఛనాక కోరాట బ్యారేజి (ఆదిలాబాద్ జిల్లా)
- చౌటుపల్లి హనుమంత రెడ్డి ఎత్తిపోతల పథకం (నిజామాబాద్ జిల్లా)
ఈ ప్రాజెక్టుల ఆమోదానికి సంబందించి అడ్వైజరీ కమిటీ మినిట్స్ త్వరలోనే జారీ చేయనున్నట్టు కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. గెజిట్ నోటిఫికేషన్లో ఆమోదం పొందని ప్రాజెక్టుల జాబితాలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)లను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2021 సెప్టెంబర్లో కేంద్ర జల సంఘానికి, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు డీపీఆర్లను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. కేంద్ర జలసంఘంలోని వివిధ విభాగాలు ఈ డీపీఆర్లను కూలంకశంగా పరిశీలించి చివరకు ఆమోదం తెలిపాయి.
అనంతరం గోదావరి బోర్డు పరిశీలన కోసం పంపించగా, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన 13వ బోర్డు మీటింగులో ఈ ప్రాజెక్టుల గురించి చర్చ జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మూడు ప్రాజెక్టులను వ్యతిరేకించినప్పటికీ, బోర్డు తన రిమార్కులతో మళ్లీ కేంద్ర జలసంఘానికి పంపించింది. కేంద్ర జల సంఘం ఆంధ్రప్రదేశ్ లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను పున:సమీక్షించి ఈ మూడు ప్రాజెక్టులకు టెక్నో ఎకనమిక్ క్లియరెన్స్ ఇవ్వవచ్చునని సిఫార్సు చేస్తూ అడ్వైజరీ కమిటీకి పంపించింది. మంగళవారం జరిగిన అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఈ మూడు ప్రాజెక్టులపై వివరమైన చర్చ జరిగింది. సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు తెలంగాణా ప్రభుత్వ ప్రతినిధులు సమాధానాలిచ్చారు. ఈ సమాధానాలకు సంతృప్తి చెంది ఈ మూడు ప్రాజెక్టులకు ఆమోదం తెలుపనున్నట్టు కమిటీ ఛైర్మన్ పంకజ్ కుమార్ ప్రకటించారు. త్వరలోనే మినిట్స్ జారీ చేస్తామని అన్నారు.
సమావేశంలో జల శక్తి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, కేంద్ర జల సంఘం ఛైర్మన్ ఆర్కే గుప్త, సభ్యులు చంద్రశేఖర అయ్యర్, రుష్విందర్ వోరా, కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్లు, పైథాంకర్, బిపి పాండే, వివిధ విభాగాల డైరెక్టర్లు, ఆర్థిక, వ్యవసాయ, ఇంధన మంత్రిత్వ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ తరపున స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్ కుమార్, ఇంజనీర్-ఇన్-చీఫ్ సి. మురళీధర్, ఎన్. వెంకటేశ్వర్లు (రామగుండం), చీఫ్ ఇంజనీర్లు శ్రీనివాస్ (ఆదిలాబాద్), మధుసూధన్ (నిజామాబాద్ ), సిఏం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్పాండే పాల్గొన్నారు.