Monday, November 25, 2024

తెలుగుదేశం పార్టీకి 40 వసంతాలు పూర్తి

తెలుగుదేశం పార్టీకి 40 ఏళ్లు నిండాయి. 1982, మార్చి 29న హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలుగు దేశం పార్టీని నందమూరి తారకరామారావు ప్రకటించారు. ఆనాడు ఎన్నో సవాళ్లు, ఎన్నో ఒడిదుడుకులను, సంక్షోభాలను ఎన్టీఆర్ అధిగమించి పార్టీని ముందుకు తీసుకువెళ్లారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే 1983 జనవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 294 స్థానాలకు 203 స్థానాలను గెలుచుకుని అధికారం లోకి వచ్చారు. దీంతో పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అధికారం చేపట్టిన పార్టీగా తెలుగు దేశం పార్టీ చరిత్ర సృష్టించింది.

కాగా సోమవారం అంటే మార్చి 29న టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పలు సేవా కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ లేఖ రాశారు. టీడీపీకి బలం కార్యకర్తలు, నాయకులే అని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడేవారికి భరోసా ఇస్తామన్నారు. పార్టీ ఆరంభించిన నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించే పథకాలు ఆరంభించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాల నుంచి యువతరాన్ని రాజకీయాలకు పరిచయం చేశారు. తెలుగుదేశం అనేది ఒక రాజకీయ పార్టీగా కంటే, కోట్లాది మందితో కూడిన అతి పెద్ద ఉమ్మడి తెలుగువారి కుటుంబంగా అందరితో ఆత్మీయత, అనుబంధం ముడిపడింది’అని లోకేష్ లేఖలో అన్నారు. తెలుగుదేశం జెండా ఎక్కడ ఎగిరితే అక్కడ శుభం, శాంతి కొలువు ఉంటాయని పేర్కొన్నారు. అటు టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలకు పార్టీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement