Friday, November 22, 2024

TCongress – పీసీసీ పీఠంపై ఆశ‌లు – సార‌థ్యం కోసం పోటాపోటీ


లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత పీసీసీ చీఫ్‌ మార్పు ఉంటుంద‌న్న చ‌ర్చ జరిగింది. కానీ, దీనిపై కాంగ్రెస్ అధిష్టానం జాప్యం చేస్తోంది. పీసీసీ అధ్య‌క్షుడుగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప‌ద‌వీ కాలం ఈ నెల 27వ తేదీతో ముగియ‌నుంది. కాబ‌ట్టి ఈ నెల‌లోనే అధ్య‌క్షుడి మార్పు ఉంటుంద‌ని ఆ పార్టీ నాయ‌కులు గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారు. పీసీసీ అధ్య‌క్షుడి ఉన్న రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ‌ పాల‌న‌వైపు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలంటే పార్టీ పీఠం నుంచి ఆయ‌న్ని వైదొల‌గాల‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.

ఎంద‌రో ఆశ‌వాహులు..

పీసీసీ పీఠంపై చాలామంది ఆశ‌లు పెట్టుకున్నారు. కొంత మంది పేర్లు బ‌య‌టికి వినిపిస్తున్న‌ప్ప‌టికి.. మ‌రికొంద‌రు ర‌హ‌స్యంగా ఢిల్లీలో కూర్చొని త‌మ య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు. పీసీసీ రేసులో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి, మ‌హేష్‌కుమార్ గౌడ్‌, మ‌ధు యాష్కీ, రాజ‌గోపాల్ రెడ్డి త‌దిత‌రులున్నారు. ఇప్ప‌టికే వీరంతా ఢిల్లీ పెద్ద‌ల‌ను క‌ల‌సి త‌మ ప్ర‌య‌త్నాలు ముమ్మరం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌.. సీనియ‌ర్ నాయ‌కుడు, పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జ‌గ్గారెడ్డి అనుభ‌వ రీత్యా త‌న‌కు ఇవ్వాల‌ని గ‌ట్టిగా ప‌ట్టుబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

రేవంత్ అనుకూల వ్యక్తికే..

కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూల వ్య‌క్తికే పీసీసీ ప‌ద‌వి వ‌రించే అవ‌కాశం ఉంటుంద‌ని చాలామంది భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు అయి ప‌దేళ్ల త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చ‌న కాంగ్రెస్‌లో కుమ్ములాట‌లు లేకుండా పార్టీ అధిష్టానం జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ముఖ్య‌మంత్రి, పీసీసీ అధ్య‌క్షుడు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసేలా, అలాంటి వ్య‌క్తిని నియ‌మించాల‌ని పార్టీ పెద్ద‌లు భావిస్తున్నార‌ని స‌మాచారం అందుతోంది.

ఈ నెల‌లోనే మార్పు ఉండోచ్చు

పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న‌ సీఎం రేవంత్ రెడ్డి ప‌ద‌వీ కాలం ఈ నెల 27న ముగియ‌నుంది. అక్టోబ‌ర్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రుగుతాయి. ఈ నేప‌థ్యంలో గ్రామీణ స్థాయిలో పార్టీ ప‌టిష్ట పెర‌గాలంటే పీసీసీకి కొత్త చీఫ్ రావాల్సిందే. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా ఉంటే ద్వితీయ శ్రేణి నాయ‌కులు త‌ర‌చూ క‌లిసే అవ‌కాశం ఉండ‌దు. దీనివ‌ల్ల పార్టీకి న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌ని ఆ పార్టీ నేత‌లు అంటున్నారు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌లు ముందు నుంచే దిగువ శ్రేణి నాయ‌కుల‌తో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ ప‌టిష్టం చేయాల్సి ఉంటుంది. క‌నీసం నాలుగు నెల‌లు ముందు అయినా పార్టీ పీఠం మార్పు ఉంటుంద‌ని ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement