Friday, November 22, 2024

Big Story: టార్గెట్‌ 2024.. వ్యూహరచనలో కమలనాథులు, యూపీ నుంచి శ్రీకారం

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింటలో ఘన విజయం సాధించిన బీజేపీ 2024లో జరగబోయే పార్లమెంట్‌ ఎన్నికలకు వ్యూహాలు రచిస్తోంది. పంజాబ్‌ మినహా ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారం చేపట్టబోతోంది. ఇదే దూకుడు కొనసాగించాలని కమలం పార్టీ నేతలు లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించారు. ఆ మేరకు కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఓ వైపు ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి సమీక్షించడం, లోపాలను సరిదిద్దడం, బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించడం, బూత్‌ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన రాష్ట్రాల నుంచే మొదలు పెడుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 80 లోక్‌ సభ స్థానాలు ఉండగా, 2014 ఎన్నికల్లో 73 సీట్లు కైవసం చేసుకోగా 2019 ఎన్నికల్లో 62 స్థానాలకే పరిమితమైంది. 2024లో గతం కంటే అత్యధిక స్థానాల్లో గెలుపొందాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహరచన చేస్తోంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికార పార్టీ వరుసగా రెండోసారి గెలవదన్న 36ఏళ్ల సంప్రదాయానికి స్వప్తి పలికి కమలం పార్టీ రికార్డును తిరగరాసింది. అదేవిధంగా ఉత్తరాఖండ్‌లోనూ అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కంటే సీట్లు తగ్గడంపై కమలం పార్టీ నేతలు దృష్టి సారించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 2017 ఎన్నికల్లో 325 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా, ఈసారి 255 సీట్లకే పరిమితమైంది. అంటే దాదాపు 60 స్థానాలు కమలం పార్టీ కోల్పోయింది. ఇందుకు గల కారణాలపై విశ్లేషణ మొదలెట్టింది. నియోజకవర్గం నుంచి జిల్లా, ప్రాంత, రాష్ట్ర స్థాయి సమీక్షలు చేయనుంది. ఏ ఏ స్థానాల్లో పార్టీకి ఓట్లు పెరిగాయి. ఏఏ స్థానాల్లో ఓట్లు తగ్గాయనే దానిపై ప్రధానంగా దృష్టి సారించారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి, అభ్యర్థి పనితీరుపైనా సమీక్ష చేయనున్నారు. దీంతోపాటు కొత్తగా కొలువుదీరనున్న యోగి ఆదిత్యనాథ్‌ మంత్రివర్గంపైనా అధినాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కేబినెట్‌ కూర్పు ఉంటుందని ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. అందులో భాగంగా గెలుపొందిన ఎమ్మెల్యేల సామాజిక, ఆర్థిక, రాజకీయ బలాబలాలతో నివేదిక తయారు చేసింది.

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ భేటీ అయినప్పుడు ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. కేబినెట్‌ కూర్పునకు సంబంధించిన ఉత్తర్‌ప్రదేశ్‌ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ధర్మేంద్ర ప్రధాన్‌ అధినాయకత్వానికి ఓ నివేదిక ఇచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేబినెట్‌ కూర్పు ఉండబోతుందని మీడియా సమావేశంలో ధర్మేంద్ర ప్రదాన్‌ సంకేతాలిచ్చారు. 24వ తేదీన బీజేపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజు సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. యోగి కేబినెట్‌ కూర్పుపై ఇప్పటికే కేంద్రం స్పష్టమైన సంకేతాలిచ్చినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. సామాజిక వర్గాలకు పెద్ద పీట వేయడంతోపాటు రాజకీయ ప్రయోజనాల ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని, అందులో ఒకరు మహిళ అని బీజేపీ రాష్ట్ర నేత చెప్పారు. కేబినెట్‌లోనూ మహిళకు అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు ధర్మేంద్ర ప్రదాన్‌ మీడియా సమావేశంలో సూచన ప్రాయంగా వెల్లడించారు.

25న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, ధర్మేంద్ర ప్రదాన్‌తో తదితరులు హాజరుకానున్నారు.
ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌లలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వాలపైనా బీజేపీ అధినాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గోవా, ఉత్తరాఖండ్‌లలో సోమవారంనాడు బీజేపీ శాసనసభా పక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. మణిపూర్‌ ముఖ్యమంత్రిగా బిరేన్‌ సింగ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2017 ఎన్నికల్లో ఎన్‌పీపీతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 60స్థానాల్లో పోటీ చేసి 32 స్థానాల్లో గెలుపొంది, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంపూర్ణ మెజారిటీ సాధించింది.

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ను మరోమారు కొనసాగించే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం. సోమవారంనాటి శాసనసభా పక్ష భేటీలో ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించిన తర్వాత సీఎం అభ్యర్థి ప్రకటన ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. తాజా మాజీ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతోనే సమస్య మొదలైంది. ఆదివారంనాడు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో పుష్కర్‌ సింగ్‌ ధామీ ప్రతినిధి బృందం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement