న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా పోలీసుల రికార్డుల్లో చేరిన రామచంద్ర భారతి (అసలు పేరు సతీశ్ శర్మ) నేపథ్యం ఆసక్తికరంగా మారింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున ఎమ్మెల్యేలతో బేరసారాలు చేస్తున్న దూతగా సైబరాబాద్ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేతలు ఆరోపిస్తుండగా.. అతనెవరో తమకు తెలియదని, తమ పార్టీ నేతల పేర్లు చెప్పినంతమాత్రాన వారితో సంబంధాలు ఉన్నట్టు కాదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు ఎవరీ రామచంద్ర భారతి? అతని నేపథ్యం ఏంటి? ఎక్కడ ఉంటున్నారు? ఏం చేస్తుంటారు? ఆయనకు నిజంగానే బీజేపీ పెద్దలతో సంబంధాలున్నాయా? వంటి అనేక ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సతీశ్ శర్మ నివసించే గృహం, పూజారిగా పనిచేస్తున్న ఆలయంలో పనిచేస్తున్నవారి నుంచి సేకరించిన సమాచారంతో అందిస్తున్న ప్రత్యేక కథనం..
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాం హౌజ్‌లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో డీల్ మాట్లాడుతూ పోలీసులకు దొరికిపోయిన రామచంద్ర భారతి నివాసముంటున్నది ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఫరీదాబాద్ (హర్యానా)లో అని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఫరీదాబాద్ సెక్టార్ 31లో ఉన్న ప్లాంట్ నెంబర్ 229లో 4 అంతస్థుల అపార్ట్మెంట్లో మొదటి అంతస్తులో ఆయన తన భార్యతో పాటు నివాసముంటున్నారు. ఒక అంతస్తులో ఒకే ఫ్లాట్ ఉంది. 3 లేదా 4 బెడ్రూంలు కలిగిన విశాలవంతమైన గృహాన్ని ఈ మధ్యనే కొనుగోలు చేసి గృహప్రవేశం చేసినట్టు తెలిసింది. అక్కడికి సమీపంలోనే ఉన్న శ్రీకృష్ణ – నవగ్రహ ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నారు.
పోలీసు రికార్డుల్లో రామచంద్ర భారతిగానే ఎక్కువగా ప్రస్తావించినప్పటికీ, ఆయన అసలు పేరుతోనే అందరికీ సుపరిచితుడు. కొద్ది నెలల క్రితం నిర్మాణం పూర్తిచేసుకున్న కొత్త అపార్ట్మెంట్లోకి మకాం మార్చడంతో ఇరుగుపొరుగుకు ఆయన గురించి పెద్దగా తెలియదు. ఆలయ పూజారిగా మాత్రమే వారందరికీ తెలుసు. అదే అపార్ట్మెంట్లో పై అంతస్తులో ఉండే పీసీ రాణా ఆంధ్రప్రభతో మాట్లాడుతూ.. ఆయన దక్షిణాది రాష్ట్రాలకు చెందినవాడని మాత్రమే తెలుసని, ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తో తెలియదని అన్నారు. సతీశ్ శర్మగానే తమకు తెలుసని, ఆయనపై కేసు నమోదైన విషయం కూడా తమకు తెలియదని అన్నారు. నాలుగు రోజులుగా కనిపించకపోవడంతో స్వస్థలానికి వెళ్లి ఉంటారని అనుకుంటున్నామని తెలిపారు.
జాతక దోషాల పరిహారం.. రాజకీయ ప్రముఖులతో సాన్నిహిత్యం
ఇరుగు పొరుగుకు ఆయన గురించి పెద్దగా తెలియకపోవడంతో.. అర్చకుడిగా సేవలందిస్తున్న శ్రీకృష్ణ-నవగ్రహ ఆలయానికి వెళ్లగా.. ఆయన పేరు చెప్పగానే అక్కడ పనిచేసే అందరూ గుర్తుపట్టారు. కేరళ నిర్మాణ శైలిలో పూర్తిగా కేరళవాసుల నిర్వహణలో ఉన్న ఆ ఆలయంలోని ప్రధాన పూజారులిద్దరిలో సతీశ్ శర్మ ఒకరు. ఇంకా చెప్పాలంటే వయస్సులో చిన్నవాడే అయినప్పటికీ.. అన్ని రకాల పూజావిధానాలు తెలిసిన పండితుడు. నవగ్రహ పూజలు, నవగ్ర హోమాలకు ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి పరిసర ప్రాంతాల ప్రముఖులే కాదు, సుదూరంగా ఉన్న బిహార్ నుంచి సైతం రాజకీయ ప్రముఖులు వచ్చిపోతుంటారు.
జాతక రీత్యా ఉన్న దోషాల పరిహారం కోసం, గ్రహదోషాల నివారణ కోసం ప్రత్యేక పూజలు చేయడంలో సతీశ్ శర్మ మంచి పేరు తెచ్చుకున్నారు. అవసరమైతే తాంత్రిక విధానాల్లోనూ పూజలు చేయడం సతీశ్ శర్మ ప్రత్యేకత. సతీశ్ శర్మ దగ్గర పూజావిధానాలు నేర్చుకుంటున్న మరొక యువ పూజారి, ఆలయ నిర్వహణ బాధ్యతల్లో సూపర్వైజర్గా పనిచేస్తున్న వ్యక్తి అందించిన సమాచారం ప్రకారం ఆలయానికి వచ్చిపోయే రాజకీయ ప్రముఖులందరితోనూ సతీశ్ శర్మతో మంచి సంబంధాలున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆరెస్సెస్)తో అనుబంధం కలిగిన సతీశ్ శర్మ తనకున్న పరిచయాలతోనూ ఎంతోమంది ప్రముఖులను ఆలయానికి తీసుకొస్తూ ఉంటారని వారు చెప్పారు. ఆయనకు భారతీయ జనతా పార్టీలో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారితోనూ సత్సంబంధాలున్నాయని అక్కడివారు గర్వంగా చెబుతున్నారు. అయితే వారికి తెలంగాణలో జరిగిన పరిణామాలు, కేసుల గురించి మాత్రం ఇంకా తెలియదు.
ఉత్తరాది రాష్ట్రాల్లో జాతకాలు, దోషపరిహారాలు, తాంత్రిక పూజా విధానాలపై నమ్మకం కలిగిన రాజకీయ ప్రముఖులకు కొదవ లేదు. అలాంటివారితో సతీశ్ శర్మ సత్సంబంధాలు ఏర్పర్చుకుని, రాజకీయ వ్యవహారాల్లోనూ దూతగా కొత్త పాత్ర పోషించేందుకు సిద్ధపడినట్టు తెలుస్తోంది. పోలీసులు సేకరించిన ఫోన్ ఆడియో సంభాషణలు, ఫాంహౌజ్ హాల్లో రికార్డ్ చేసిన ఆడియో, వీడియో క్లిప్పుల్లో సతీశ్ శర్మ తనకున్న పరిచయాల గురించి చెప్పుకున్నారు. ఇలాంటి డీల్‌తో బీజేపీ పెద్దల దగ్గరకు వెళ్తే తన పరపతి మరింత పెరుగుతుందన్న ఆలోచనతో నందు కుమార్, సింహయాజి స్వామితో కలిసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు మొదలుపెట్టారా? లేక పార్టీలో కీలక స్థానంలో ఉన్న ఆరెస్సెస్ నియమిత బీఎల్ సంతోష్ నిజంగానే ఈ పనిని సతీశ్ శర్మకు అప్పగించారా? అన్న విషయం మాత్రం ఇంకా తేలాల్సి ఉంది.