Saturday, November 23, 2024

దొంగ ఓటేసిన మున్సిపల్ ఛైర్‌పర్సన్

హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్పీ ఎన్నికల్లో మున్సిపల్ ఛైర్ పర్సన్ తాటికొండ స్వప్న దొంగ ఓటు వేశారని ప్రతిపక్ష కౌన్సిలర్లు, నాయకులు ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేయాలంటూ జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జిల్లా కలెక్టర్ పౌసుమిబసును ఆదేశించారు. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్ తాండూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ వేసిన దొంగ ఓటుపై విచారణ చేసి నిర్ధారించినట్లు సమాచారం. దీంతో ఆమె జైలుకు వెళ్లడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాగా దొంగ ఓటు వేసిన మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న రాజీనామా చేయాలని బల్దియా కార్యాలయం ముందు కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జన సమితి కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు.

వాస్తవానికి తాండూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ తాటికొండ స్వప్నకి ఓటు లేదని స్పష్టమవుతోంది. ఓటు కొరకు దరఖాస్తు చేసుకున్నా సరైన పత్రాలు, వివరాలు ఇవ్వకపోవడంతో మున్సిపల్ ఛైర్‌పర్సన్ తాటికొండ స్వప్న దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. ఇదిలా ఉంటే ఛైర్‌పర్సన్ స్వప్న తన పేరు మాదిరిగానే ఉన్న తోటి కోడలు తాటికొండ స్వప్న భర్త పేరు అశ్విన్ ఓటును వినియోగించుకున్నారు. వాస్తవానికి మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త పేరు పరిమల్. కానీ భర్త పేరు అశ్విన్‌గా చూపుతూ తాటికొండ స్వప్న ఓటును మున్సిపల్ చైర్‌పర్సన్ వేయడం గమనార్హం. తాండూరు పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం 283లో క్రమ సంఖ్య 528లో ఉన్న తాటికొండ స్వప్న పేరిట నమోదైన ఓటును చైర్ పర్సన్ వేసినట్లు సమాచారం. అయితే మున్సిపల్ ఛైర్‌పర్సన్‌తో పాటు క్రమ సంఖ్య 528లో ఉన్న ఓటరు పేరు సైతం పూర్తిగా ఒకే విధంగా ఉన్నాయి. అయితే దీనిని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి వినయ్ కుమార్ గుర్తించలేదు. అయితే ఇక్కడ ఎన్నికల అధికారి పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement