వర్షాల వల్ల సంభవించిన ప్రమాదాల్లో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మరో ముగ్గురు మరణించారు. దాదాపు వారం రోజుల నుంచి కురుస్తున్న వానలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 26కి చేరిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ముగ్గురిలో ఇద్దరు చెన్నైకి చెందినవారు కాగా.. మరొకరు తిరువారూర్ జిల్లాకు చెందిన వ్యక్తి ఉన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున సాయం ప్రకటించింది. ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 29న రాష్ట్రాన్ని తాకాయి. అప్పటి నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమవతున్నాయి. కాగా.. గడిచిన 24 గంటల్లో తమిళనాడులో 10.04 మి.మీ వర్షపాతం నమోదైంది. నాగపట్నం జిల్లాలోని కొడియకరై స్టేషన్‌లో అత్యధికంగా 9 సెంటీమీటర్లు, రామేశ్వరం (రామనాథపురం)లో 8 సెంటీ మీటర్లు కొట్టారం (కన్యాకుమారి), కులశేఖరపట్టణం (తూత్తుకుడి)లో వరుసగా 7 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. చెన్నైలో వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు 191 రిలీఫ్ క్యాంపులును ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. ఈ వానల వల్ల ప్రమాదాల్లో చిక్కుకున్నవారిని రక్షించి సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు.భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే సోమవారం (నవంబర్ 7) వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళ, మాహేలలో భారీ నుండి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పశువులు మృత్యువాత పడుతున్నాయి. తీవ్ర ఆస్తినష్టం జరుగుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement