దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. వైరస్ కట్డడికి అనేక రాష్ట్రాలు లాక్ డౌన్, కర్ఫ్ఫూ అమలు చేస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటికీ పెద్దగా ఉపయోగం కనిపించడం లేదు. ఇప్పటికీ కరోనా వ్యాప్తి అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. గత నాలుగు రోజుల నుంచి కేసులు పెరుగుతుండడంతో స్టాలిన్ సర్కారు అప్రమత్తమైంది. ఈ క్రమంలో కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ ను మే 31 వరకూ పొడిగించినట్టు తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది.
ప్రస్తుం కొనసాగుతున్న లాక్ డౌన్ మరో రెండ్రోజుల్లో ముగియనుండడంతో సీఎం స్టాలిన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై చర్చించారు. వైద్య, ఆరోగ్య నిపుణులు రెండు వారాలు కఠిన లాక్ డౌన్ విధించాలని సూచించారు. ఎలాంటి మినహాయింపులు లేకుండా పకడ్బందీగా లాక్ డౌన్ విధించాలని, అప్పుడే కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తుందని వారు అభిప్రాయపడ్డారు. దీంతో రాష్ట్రంలో మరో వారం పాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మే 24 నుంచి ఈ పొడిగింపు అమల్లోకి వస్తుంది.
ఇంతకుముందు మే 10 నుంచి 24వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించడం తెలిసిందే. తమిళనాడులో సోమవారం నుంచి వారం రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయనున్నారు. ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. ఏం చేసినా.. ఏం కొనుక్కోవాలన్నా ఇవాళ, రేపు మాత్రమే అవకాశం ఉంది. ఆదివారం రాత్రి 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్నీ మూతపడతాయి. చివరకు కిరాణ షాపులు కూడా మూసివేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, అత్యవసర సర్వీసులు, మెడికల్ షాపులు, ఆస్పత్రులు, మీడియాకు మినహాయింపు ఇచ్చారు. కాగా, తమిళనాడులో నిన్న ఒక్కరోజే 36,184 కరోనా కేసులు నమోదు కాగా… 467 మరణించారు.