సుప్రీంకోర్టు వెలువరించిన ఈడబ్ల్యూఎస్ కోటా తీర్పుని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విభేదించారు. దీనిపై చర్చించేందుకు భేటీకి రావాలని అఖిలపక్షాలకు స్టాలిన్ పిలుపునిచ్చారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత రాష్ట్ర సచివాలయంలో సీనియర్ మంత్రులు, న్యాయ నిపుణులతో సీఎం స్టాలిన్ భేటీ అయ్యారు. దీని తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. సామాజిక న్యాయం పోరాటానికి ఈ తీర్పు ఎదురుదెబ్బగా ఉంటుందని ఆ తర్వాత తమ వాయిస్‌ని వినిపించారు. సమావేశం అనంతరం ఈ అంశంపై చర్చించేందుకు నవంబర్ 12న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.
‘‘ఆర్థికంగా బలహీనమైన విభాగం ఏది రాజ్యాంగంలో నిర్ణయించలేదని మేము వాదించాము. ఈ సవరణ SC/ST, OBC తరగతులను దూరంగా ఉంచుతూ రాష్ట్రానికి అదనపు సాధారణ అధికారాన్ని కూడా ఇస్తుంది. EWSని గుర్తించడానికి ఎట్లాంటి మార్గదర్శకాలు లేవు. వార్షిక ఆదాయం రూ.8 లక్షలు అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రం దాన్ని ఎంత మొత్తానికి పెంచుకోవచ్చు అనేది చెప్పలేదు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని కేంద్రం ఉల్లంఘిస్తోంది’’.. అని సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఎంపీ, న్యాయవాది పి. విల్సన్ అన్నారు.
అయితే దీనిపై బీజేపీ నేతలు సీఎం స్టాలిన్ తీరును ఖండిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రికి ఈ విషయంలో చాలా భయం పట్టుకుందని బీజేపీ నేత అన్నామలై అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఈడబ్ల్యూఎస్‌కు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశంపై తదుపరి చర్య తీసుకునే ముందు న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటానని స్టాలిన్ అన్నారు. తమిళనాడు రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు సామాజిక న్యాయం కోసం చేతులు కలపాలని స్టాలిన్ కోరారు.
ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో EWS అభ్యర్థులకు 10 శాతం రిజర్వేషన్‌ను అనుమతించే 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటును సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది. రిజర్వేషన్ ప్రయోజనాల నుండి షెడ్యూల్డ్ కులాలు (ఎస్సిలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టిలు), ఇతర వెనుకబడిన తరగతులు (ఓబిసిలు) సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు (ఎస్‌ఇబిసి)లలోని ‘పేద పేదలను’ కూడా ఈ సవరణ మినహాయించింది.