న్యూఢిల్లి: ఆమె చాలా తెలివైనది.. కథలు చెబుతుంది.. పాఠాలు నేర్పిస్తుంది.. గణిత పట్టికలు మెదళ్లకు చేరేలా వివరిస్తుంది… విద్యార్థులతో కలసిపోతుంది. బెత్తంతో భయపెట్టకుండా విద్యార్థులకు ఎలా చెబితే నచ్చుతుందో తెలుసుకుని మరీ పాఠాలు చెబుతుంది. ఆమె పేరు శిక్షా.. విద్యార్థినిలా కనిపించే టాకింగ్ డాల్. ఒక్క మాటలో చెప్పాలంటే రోబో టీచర్. ఉత్తర కర్ణాటకలోని సిర్సా అనే పట్టణంలోని ఓ స్కూల్‌లో రోబో టీచర్ పాఠాలు చర్చనీయాంశం అయ్యాయి. దీనికి అద్భుతమైన స్పందన లభిస్తోందని రోబో రూపకర్తలు చెబుతున్నారు.
సిర్సీలోని ఎంఈఎస్ చైతన్య ప్రీ యూనివర్శిటీ కాలేజీలో ఫిజిక్స్ బోధించే అక్షయ్ మషేల్కర్ ఈ ఆలోచన చేశారు. రోబోటిక్ ప్రాజెక్ట్‌లో పనిచేసిన విద్యార్థి ఇంటర్న్ శ్రేయ డి రోబోలో వాయిస్. ప్రోటోటైప్‌ను ప్రారంభించారు. ఇప్పుడు దానిని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. శిక్షా 2:0 కమర్షియల్ ప్రోటోటైప్ త్వరలో లాంచ్ కానుందని వెల్లడించారు. నా చిన్నతనం నుండి, బొమ్మలు మాట్లాడటం పట్ల ఆకర్షితుడను అయ్యాను. అప్పట్లో ఒక చైనీస్ బొమ్మ ఉండేది. మెడను నొక్కితే కిలాకిలా నవ్వేది. మల్లి అలాంటి బొమ్మను పొందలేక పోయాను. ఇప్పుడు నేను పెద్దయ్యాను. పిల్లలకు ఏది నచ్చుతుందో నాకు బాగా తెలుసు. అందుకే బాగా ఆలోచించి స్టూడెంట్ రోబోట్‌ను తయారు చేశాను. ఇది విద్యార్థులను ఆకర్షిస్తుంది అని మషేల్కర్ వివరించారు
రోబోట్ దాని మినీ -కంప్యూట ర్‌లో స్టోరీటెల్లింగ్, మ్యాథ్స్ ఈక్వేషన్స్, స్పెల్లింగ్, రైమ్స్ వంటి ఇన్‌బిల్ట్ ప్రోగ్రామ్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం, 4వ తరగతి అంతకంటే తక్కువ తరగతులకు పాఠాలు బోధించేలా రోబోట్‌ను అభివృద్ధి చేశాం. ఇప్పుడు దాని సామర్థ్యాన్ని పెంచాలని ప్రయత్నిస్తున్నాం. తదుపరి వెర్షన్‌లో, హస్కూల్ విద్యార్థులను ఆకర్షించే మరిన్ని ఫీచర్లను అందిస్తాము. విద్యలో కళ, సాంకేతికతను ఏకీకృతం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం అని మషేల్కర్ చెప్పారు. శిక్షా వార్త సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుండి మషేల్కర్‌కు డెమో కోసం కాల్స్ వస్తున్నాయి. చాలా మంది తమ కాలేజీలకు ఆహ్వానిస్తున్నారు. నా ఖాళీ సమయంలో పాఠశాలలకు వెళ్తున్నాను. నాతోపాటు శిక్షాను తీసుకెళ్తున్నాను. భవిష్యత్తులో అలాంటి రోబోలను అభివృద్ధి చేయడానికి ఆర్థిక సహాయంకోసం చూస్తున్నాను. నాతో కలిసి పని చేయాలనుకునే ఆసక్తిగల సాంకేతిక ప్రతిభావంతుల కోసం కూడా వెతుకుతున్నాను అని మషేల్కర్ చెప్పాడు.