Thursday, November 21, 2024

తాలిబ‌న్ల మ‌రో ఆదేశం..మ‌హిళా న‌టులు ఉన్న షోల‌కి నో ప‌ర్మిష‌న్..

ఇప్ప‌టికే మ‌హిళ‌ల‌పై ఎన్నో ఆంక్ష‌లు విధించిన తాలిబ‌న్లు..ఇప్పుడు మ‌రో ఆంక్ష‌ని విధించిన వైనం విస్తుపోయేలా చేస్తోంది..ఆఫ్గ‌నిస్థాన్ ని చేజిక్కించుకుని వారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబ‌న్ల ఆగ‌డాల‌కు హ‌ద్దే లేకుండా పోతోంది. ఆడ‌వారితో పాటు మ‌గ‌వారికి ప‌లు హుక్కుంలు జారీ చేస్తూ నిత్య న‌ర‌కాన్ని వారికి చూపిస్తున్నారు. దాంతో ఆఫ్గ‌న్ వాసులు దీన‌స్థితిలో బ‌తుకును వెల్ల‌దీస్తున్నారు. వారి ప్ర‌భుత్వాన్ని నెల‌కొలిపిన త‌ర్వాత ఎన్నో ఆంక్ష‌లు విధించిన వారు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలపై నిబంధనలు కొనసాగిస్తున్నారు. తాజాగా టీవీ షోలపైనా ఆంక్షలు విధించింది తాలిబ‌న్ ప్ర‌భుత్వం.

మహిళా నటులు ఉండే షోలు, డ్రామాల ప్రసారాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఆఫ్ఘన్ మంత్రిత్వ శాఖ నుంచి అక్కడి మీడియాకు వచ్చిన తొలి అధికారిక ఉత్తర్వులు ఇవి. ఫిమేల్ యాక్ట‌ర్స్ ఉండే కార్యక్రమాలతోపాటు, మహమ్మద్ ప్రవక్త, ఇతర మత ప్రముఖులను చూపించే సినిమాలు, ప్రోగ్రాంలను ఛానళ్లు ప్రసారం చేయరాదని ఆ దేశ ప్రమోషన్ ఫర్ వర్చ్యూ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వైస్ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక, వుమెన్ జ‌ర్న‌లిస్ట్ లు రిపోర్టింగ్ చేసే సమయంలో తప్పనిసరిగా హిజాబ్ ధరించాలని స్పష్టం చేసింది.

2001లో ఆఫ్గాన్ లో ప్రజాస్వామ్య పాలన తర్వాత ఆ దేశ మీడియాలో చాలా మార్పులు వచ్చాయి. పాశ్చాత్య దేశాల మద్దతుతో నడిచిన పాలనలో ఎన్నో టీవీ ఛానళ్లు, రేడియో స్టేషన్లు పుట్టుకొచ్చాయి. గత 20 ఏళ్లలో ఈ ఛానల్ లు అన్నీ ఎలాంటి అవాంతరాలు లేకుండా అనేక కార్యక్రమాలను స్వేచ్ఛగా ప్రసారం చేశాయి. అమెరికన్ ఐడల్ లాంటి రియాల్టీ షో లతోపాటు పలు విదేశీ షోలు, భారతీయ సినిమా, సీరియళ్లను ప్రసారం చేశాయి. ఇప్పుడు మళ్లీ తాలిబన్ల ప్రభుత్వం అధికారంలోకి రాగానే… వాటిపై కొరడా ఝుళిపిస్తోంది. ఇప్పటికే ఐపిఎల్ ప్రసారాలపై నిషేధం విధించిన తాలిబన్ ప్ర‌భుత్వం.. ఇప్పుడు మహిళలు నటించే ప్రోగ్రాం తీసుకువచ్చింది. దీంతో రెండు దశాబ్దాల కింద ఉన్న తాలిబన్ల అరాచక పాలన మళ్లీ మొదలైందని ప్రజలు వాపోతున్నారు.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement