అఫ్గనిస్థాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్‌లు దేశంలో తమ అరాచకాలు మొదలు పెట్టారు. గతంలో మాదిరిగానే తమ సహజ ప్రవర్తనను బయటపెడుతున్నారు. అఫ్గాన్‌లో మహిళలపై ఆగడాలు అంతకంతకూ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా నిండు గర్భంతో ఉన్న ఓ మహిళా పోలీస్ అధికారిణిని దారుణంగా హత్య చేశారు. ఆమెను కుటుంబసభ్యుల ఎదుటే తుపాకితో కాల్చిచంపారు. సెంట్రల్ ఘోర్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తాలిబన్ల చేతిలో హతమైన జైలు అధికారిణి బాను నెగర్‌గా గుర్తించారు. తమ భద్రత గురించి అఫ్గన్ మహిళలు ఆందోళన చెందుతున్న సమయంలోనే ఈ దారుణానికి ఒడిగట్టారు.
అయితే, ఈ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని తాలిబన్లు తెలిపారు. ఈ హత్యపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తులకు తాము ఇప్పటికే క్షమాభిక్షను ప్రకటించామని తాలిబన్ ముఖ్య అధికార ప్రతినిధి జుబిహుల్లా ముజాహిద్ద్ తెలిపారు. నెగర్ హత్య వెనుక వ్యక్తిగత శత్రుత్వం లేదా మరేదైనా ఉండొచ్చని తెలిపారు.
ఇది కూడా చదవండి: వెదర్ అలర్ట్: మరో మూడు రోజులు వానలే వానలు