Friday, November 22, 2024

పంజ్‌షీర్‌ పై తాలిబన్ల జెండా

అఫ్గనిస్తాన్‌ను తమ వశం చేసుకున్న తాలిబన్లు.. పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌పై పట్టు సాధించేందుకు జరుగుతున్న పోరులోనూ పైచేయి సాధించారు. మొత్తం ప్రాంతమంతా వాళ్ల ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం అధికారికంగా తాలిబన్లు ఈ విషయాన్ని ప్రకటించుకున్నారు. పంజ్‌షీర్‌ ప్రావిన్సియల్‌ గవర్నర్‌ కార్యాలయంపై తాలిబన్లు జెండా ఎగరవేశారు.

తాలిబన్లతో జరిగిన పోరులో ఎన్ఆర్ఎఫ్ అధికార ప్రతినిధి ఫహీద్ దష్తే, అహ్మద్ మసూద్ మేనల్లుడు సాహిబ్‌ అబ్దుల్‌ వాదూద్‌ జహోర్‌ సహా ముఖ్యనేతలు మృతిచెందారు. అఫ్గన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ఇంటిపై తాలిబన్లు దాడిచేయడంతో ఆయన తప్పించుకున్నారు. సలేహ్ సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయినట్టు సమాచారం. పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్లు పంజ్‌షేర్‌ దళాలపై విస్తృతంగా దాడులు చేసినట్లు తెలుస్తోంది.

పంజ్ షీర్ల శాంతి ప్రతిపాదనను తాలిబన్లు తిరస్కరించారు. పంజ్ షీర్ ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. పంజ్ షీర్ గవర్నర్ కార్యాలయంపై తాలిబన్లు తెలుపు జెండా ఎగరేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే తాలిబన్లను భారీ సంఖ్యలో మట్టుపెట్టామని పంజ్‌షీర్‌ యోధులు ప్రకటించిన రోజులోనే.. ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. అఫ్గనిస్తాన్‌లో చిట్టచివరి ప్రాంతాన్ని కైవసం చేసుకోవడంలో తాలిబన్లు సఫలమైనట్లు తాలిబన్‌ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ తెలిపాడు.

పంజ్‌షీర్ లోయ 1980లలో సోవియట్ దళాలు, 1990 దశకంలో తాలిబాన్‌లను ప్రతిఘటించి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. తన చివరి ఊపిరి వరకూ తాలిబన్లతో పోరాడుతానని ప్రకటించిన దష్తే.. వారితో జరిగిన పోరులో ఆదివారం వీరమరణం పొందినట్టు ఎన్ఆర్ఎఫ్ఏ ప్రకటించింది. అటు, తాలిబన్లకు పాకిస్థాన్‌ బహిరంగంగానే మద్దతు ఇస్తోంది. ఇన్నాళ్లు తాలిబన్లకు తాము సాయం చేయడం లేదని దబాయించిన పాక్.. నేరుగా తన డ్రోన్లను పంజ్‌షీర్‌కు పంపినట్లు వార్తలొస్తున్నాయి. వీటి సాయంతోనే తాలిబన్లు పంజ్‌షీర్‌‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఆగ‌స్ట్ 15న అఫ్గాన్ ను తాలిబ‌న్ల ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement