ఆఫ్ఘనిస్తాన్ ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎన్నికలతో సంబంధం లేదని, దేశంలోని స్వతంత్ర ఎన్నికల సంఘం, ఎన్నికల ఫిర్యాదు కమిషన్‌ను రద్దు చేసినట్లు ప్రకటించారు.
ప్రస్తుతం దేశంలో వీటితో అవసరం లేదని ఒకవేళ భవిష్యత్ లో అవసరం అనిపిస్తే వాటిని ఇస్లామిక్ ఎమిరేట్ ద్వారా పునరుద్ధరిస్తామని తెలిపారు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు ఎన్నికల కమిషన్‌లతో పాటుగా శాంతి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలను కూడా రద్దు చేసినట్లు తాలిబాన్ల అధికారి ఒకరు తెలిపారు.
2006లో స్థాపించబడిన IEC కమిషన్ అధ్యక్ష ఎన్నికలతో సహా అన్ని రకాల ఎన్నికల నిర్వహణ,పర్యవేక్షణను తప్పనిసరి చేసింది. తాలిబాన్లు గతంలో మహిళా వ్యవహారాల మంత్రిత్వ శాఖను రద్దుచేశారు.
మరోవైపు ఆఫ్గాన్ మహిళలు జర్నీ చేయడానికి కొత్త ఆంక్షలు తీసుకొచ్చింది తాలిబన్ ప్రభుత్వం. మహిళల వెంట మగాళ్లు తప్పకుండా ఉండాలని రూల్ పెట్టింది. అంతేకాకుండా మహిళలు తమ సాంప్రదాయం ప్రకారం.. ఇస్లామిక్ హిజాబ్స్ ని ధరించాలని, అట్లాంటి వారినే వాహనదారులు ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని సూచించింది.
కాగా, అమెరికా సైన్యం వెళ్లిన తర్వాత ఈ ఏడాది ఆగస్ట్ లో ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్ హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం దేశంలో తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..