తాలిబన్లు ఈ పేరు వింటేనే ప్రజలకి వణుకు.. ప్రపంచదేశాలన్నీ కూడా తాలిబన్లకి దూరంగానే ఉంటున్నాయి. కాగా ఆఫ్ఘానిస్థాన్ ని ఆక్రమించుకుని అక్కడ తమ ప్రభుత్వాన్ని స్థాపించిన తాలిబన్లు మొన్నా, నిన్నటి వరకు కాలర్ ఎగరేశారు. అయితే ప్రస్తుతం అక్కడి పరిస్థితులు మారాయి. ఆకలితో అలమటిస్తున్నారు ప్రజలు. ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. దాంతో తమపై విధించిన ఆంక్షలను సడలించాలని తాలిబన్ ప్రభుత్వం వేడుకోవడం విశేషం. ఎంతో కఠినంగా ఉండే తాలిబన్లు కాస్త తలవంచుతున్నారు.
అంతేకాదు మొన్నా, నిన్నటి వరకు తమ విషయంలో జోక్యం చేసుకోవద్దని పలు దేశాలని హెచ్చరించిన తాలిబన్లు, నేడు అంతర్జాతీయ సమాజంతో మంచి సంబంధాలను కోరుకుంటున్నామని కాబట్టి తమ దేశంపై విధించిన బ్యాన్ ను సడలించాలంటు చుట్టుపక్కల దేశాలను తాలిబన్లు కోరుతున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ లో అధికారాన్ని కబ్జా చేసిన కొత్తల్లో ప్రపంచదేశాలతో తమకు పనేముందన్నట్లుగా వ్యవహరించారు. ఏ దేశంతో కూడా ఏ విషయంలోనూ చర్చలు జరిపేదేలేదని భీష్మించుకుని కూర్చున్నారు. అసలే తాలిబన్లంటే మంటమీదున్న అమెరికా మిత్ర దేశాలతో పాటు ఇండియా లాంటి పొరుగు దేశాలు కూడా విపరీతమైన ఆంక్షలను విధించాయి.ఏ దేశంతో అయినా చర్చించాలంటే అది బెదిరింపు ధోరణిలో మాత్రమే ఉండేవి. అలాంటిది ఇపుడు ప్రపంచ దేశాలను బతిమలాడుకునే స్థాయికి వచ్చేసింది తాలిబన్ల పరిస్థితి.
దీనికి కారణం ఏమిటంటే ఆంక్షలు మాత్రమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆఫ్ఘన్ నుంచి ఎగుమతులు-దిగుమతులు విషయంలో బ్యాన్ కంటిన్యు అవుతోంది. దీనివల్ల దేశంలో ఆహార సమస్య బాగా పెరిగిపోతోంది.చిన్నా పెద్దా తేడాలేకుండా ఆకలి చావులు పెరిగిపోతున్నాయి. కరెన్సీ సమస్య బాగా పట్టి పీడిస్తోంది. ఇదే సమయంలో విదేశాల్లో ప్రత్యేకించి అమెరికాలో ఉన్న మిలియన్ల ఆఫ్ఘన్ కరెన్సీతో పాటు వందల టన్నుల బంగారం కూడా తాలిబన్ల చేతికి అందకుండా పోయింది. ఇదే విషయమై విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాబీ మాట్లాడుతూ ఆడపిల్లలకు విద్య ఉద్యోగ-ఉపాధి కల్పన ద్వారా మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడుందన్నారు. ఇవన్నీ జరగాలంటే తమకు ప్రపంచదేశాల సాయం చాలా అవసరమన్నారు. తమ దేశంపై ఆంక్షల విధించటం వల్ల తమ ప్రజలకు నష్టమే కానీ ఏ దేశానికీ ఉపయోగం ఉండదని చెప్పారు.
అధికారంలోకి వచ్చిన కొత్తల్లో తమ వల్ల కొన్ని తప్పులు జరిగినట్లు ముత్తాబీ అంగీకరించటం గమనార్హం. జరిగిపోయిన వాటి గురించి మాట్లాడే బదులు జరగాల్సిన వాటి గురించే ఆలోచించాలని ముత్తాబీ ప్రపంచ దేశాలను కోరుకున్నారు.ఐసిస్ చేసిన దాడులు కూడా ప్రపంచ దేశాలు తాలిబన్లే చేశాయని నమ్మటం నిజంగా తమ దురదృష్టమన్నారు. శాంతి స్ధాపనకు మానవహక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడుందని ముత్తాబీ చెప్పటమే విచిత్రంగా ఉంది. మహిళలను హింసించటంలో ముందుండే తాలిబన్లకి వారి ఉసురే తగిలి ఉంటుందని కొందరి వాదన. అతి క్రూరమైన తాలిబన్లు బతిమలాడే స్థాయికి వచ్చారంటే నమశక్యం కాని విషయం. తాలిబన్లని పూర్తిగా నమ్మటానికి వీలు లేదు కానీ , ఆఫ్ఘన్ ప్రజల పరిస్థితికి జాలి పడి సహాయం అందించవచ్చు. మరి అమెరికా ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..