‘ప్రధాని మోదీజీ.. గుంతలమయంగా మారిన భావ్‌నగర్-సోమనాథ్ రోడ్లపై జర్నీ చేయండి’ అని గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చూడసామ విమల్భాయ్ కనాభాయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. ఆగస్టు 27-29 వరకు గుజరాత్ రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఆయన రాసిన లేఖ వైరల్‌గా మారింది.
‘కోస్టల్ హైవేకు కేంద్ర ప్రభుత్వం ఏడేళ్ల క్రితం ఆమోదం తెలిపింది. హైవే అసంపూర్తిగా ఉంది. నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మిగిలిన రహదారిలో చాలా చోట్ల గుంతలు పడ్డాయి. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రికి లేఖ రాసినా పట్టించుకోవడం లేదు’ అని విమల్భాయ్ తన లేఖలో పేర్కొన్నారు.
పవిత్రమైన శ్రావణ మాసంలో సోమనాథ్ ఆలయానికి లక్షలాది మంది భక్తులు వస్తారని, వారు ఈ రహదారిని ఉపయోగిస్తారని చెప్పారు. సోమనాథ్ ఆలయ ట్రస్ట్‌కు చైర్మన్‌గా ఉన్న ప్రధాని మోదీ ఈ రోడ్డుగుండా ప్రయాణిస్తే భక్తుల బాధలు అర్థమవుతాయని తెలిపారు. భక్తుల బాధలను అర్థంచేసుకుని వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.