తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున తైపీలో స్వల్ప వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది. రిక్టర్‌స్కేలు వీటి తీవ్రత 6.6గా నమోదయింది. భూమి అంతర్భాగంలో 30.6 కిలోమీటర్ల లోతులో, మరొకటి 19.3 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. భూకంప కేంద్రాలు హువాలియన్ కౌంటీలో, టైటుంగ్ నగరానికి సమీపంలో ఉన్నాయని అధికారులు తెలిపారు. భూకంప ప్రభావం తైవాన్ అంతటా ఉన్నదని, కొద్ది సెకన్ల పాటు భవనాలు ఊగిపోయాయని అధికారులు పేర్కొన్నారు. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు.
కాగా, 2016లో దక్షిణ తైవాన్‌లో సంభవించిన భూకంపంలో 100 మందికి పైగా మరణించగా, 1999లో 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 2 వేల మందికి పైగా మరణించారు.