– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
టాలీవుడ్ , బాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలు ఈ ఏడాది ఓ ఊపు ఊపేశాయి. అట్లాంటి సినిమాల్లోని క్యారెక్టర్స్ గురించి ఇప్పటికీ చాలామంది చర్చించుకుని నవ్వుకుంటారు. అయితే.. గణేశ్ నవరాత్రుల సందర్భంగా పలువురు హీరోల రోల్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రికార్డులతో దుమ్ము రేపిన పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాల్లోని హీరో పాత్రలతో వినాయక విగ్రహాలు రూపొందాయి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పాత్రలకు సంబంధించిన ఫోజులతో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లలో పెట్టడంతో అవి విపరీతంగా వైరల్ గా మారాయి.
పుష్ప సినిమాలో పుష్పరాజ్ పాత్ర పోషించిన అల్లు అర్జున్ డైలాగ్ ‘తగ్గేదేలే..’. పలు చోట్ల ఇదే పుష్పరాజ్ పాత్ర ఆహార్యంలో.. అదే జుత్తు, వస్త్రాలు, ఇతర లక్షణాలతో.. తగ్గేదేలే అంటూ గడ్డంపై చేయి పెట్టినట్టుగా ఉన్న గణేశుడి ప్రతిమ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పోషించిన సీతారామరాజు పాత్రకు సంబంధించి వివిధ రూపాల్లోని గణేశ విగ్రహాలు అలరిస్తున్నాయి. సినిమా క్లైమాక్స్ లో రామ్ చరణ్ పరుగెడుతూ ఉన్నప్పటి తరహాలో బాణాన్ని ఎక్కుపెడుతున్నట్టుగానే రూపొందించిన గణేశ విగ్రహాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.