కరోనా కేసుల కరాణంగా ఐపీఎల్-2021ని నిరవధిక వాయిదా వేసినట్లు మంగళవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. కఠినమైన బయో బబుల్‌లో ఆటగాళ్లను ఉంచి, ప్రేక్షకులను మైదానాలకు రాకుండా చేసి మ్యాచ్‌లు నిర్వహించినా.. బబుల్‌ను ఛేదించుకుని ఆటగాళ్లను కరోనా సోకడంతో చేసేది లేక వాయిదా వేసింది. దీంతో ఇప్పుడు అక్టోబర్, నవంబర్‌లలో జరగాల్సిన టీ-20 ప్రపంచకప్‌పై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి.
ఈ నేపథ్యంలో టీ-20 ప్రపంచకప్ టోర్నీని యూఏఈకి తరలించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ టోర్నీలో 16 జట్లు పాల్గొంటాయి. అసలే అంతర్జాతీయ టోర్నీ. ఏమాత్రం తేడా వచ్చినా.. బీసీసీఐతో పాటు భారత ప్రభుత్వ పరువు కూడా పోతుంది. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయా జట్లు కూడా భారత్‌కు రావాలంటే జంకుతున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ కూడా చెప్పింది.
టీ-20 ప్రపంచకప్‌ను యూఏఈకి తరలించేందుకు ఇప్పటికే బోర్డు పెద్దలు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించారని వినికిడి. ప్రభుత్వం సైతం ఇందుకు అంగీకరించిందనే సమాచారం. ‘నాలుగు వారాల్లోనే ఐపీఎల్‌ను వాయిదా వేయడం అంతర్జాతీయ మెగా టోర్నీ నిర్వహణకు సురక్షితం కాదన్న సంకేతాలు పంపించింది. దేశం గతంలో ఎన్నడూ చూడని ఆరోగ్య విపత్తును చవిచూస్తోంది. నవంబర్ మాసంలో భారత్‌లో మూడో వేవ్ ఉంటుందని అంచనా. ఆతిథ్యం బీసీసీఐదే అయినప్పటికీ టీ-20 ప్రపంచకప్ టోర్నీని యూఏఈకి తరలించాలన్నది ఆలోచన’ అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.