ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకుని నమ్మకంగా మాట్లాడుతూ వారి ఇంట్లోనే బంగారు ఆభరణాలు కొట్టేశాడో యువకుడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగింది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ చంద్రశేఖర్, డీఐ అంజనేయులు, సీఐ నర్సింగ్‌రావు ఈ చోరీ వివరాలు మీడియాకు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా చింతలగుట్ట తండాకు చెందిన బానోతు సురేశ్ నాయక్ అలియాస్ సన్ని ఆల్విన్‌కాలనీలో ఉంటూ స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. మూసాపేట శ్రీహరినగర్‌లో నివాసం ఉండే ఓ బాలికను సురేశ్‌నాయక్ జనవరిలో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకుని చాట్ చేస్తున్నాడు.
గత నెల 20, 24 తేదీల్లో బాలిక ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో సురేశ్ ఇంట్లోకి వెళ్లాడు. ఆ బాలికను మాటల్లో పెట్టి కూల్‌డ్రింక్ కోసం షాప్‌కు పంపి బీరువాలో ఉన్న 24.5 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలుసుకున్న బాధితులు కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో మే 1న ఫిర్యాదు చేశారు. పోలీసులు బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నేరం అంగీకరించాడు. అతడి వద్ద నుంచి 24.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన సిబ్బందిని ఏసీపీ అభినందించారు. అనంతరం సిబ్బందికి రివార్డులు అందించారు.