Tuesday, November 26, 2024

Big Story: రష్యాపైకి స్విఫ్ట్‌ అస్త్రం.. అమెరికా, ఈయూ నిర్ణయం.. రష్యా బ్యాంకులపై పెనుప్రభావం

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను నిలువరించేందుకు అమెరికా, యూరోపియన్‌ దేశాలు మలిదశ ఆంక్షలకు దిగాయి. మాస్కో ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేసే దిశగా కీలక చర్యలు చేపట్టాయి. తాజాగా స్విఫ్ట్‌ అస్త్రాన్ని సంధించాయి. స్విప్ట్‌ (సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ టెలికమ్యూనికేషన్స్‌) నుంచి రష్యాకు చెందిన కీలక బ్యాంకులను తొలగిస్తున్నట్లు అమెరికా, ఐరోపా సమాఖ్య, కెనడా, బ్రిటన్‌ దేశాలు ప్రకటించాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దీంతో రష్యా బ్యాంకింగ్‌ రంగం అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించడం చాలా కష్టంగా మారిపోనుంది.

స్విఫ్ట్‌ గురించి వైట్‌హౌస్‌ విడుదల చేసిన ప్రకటన ఇలా పేర్కొంది. రష్యా దాడిని ప్రతిఘటించడానికి మేము ఉక్రెయిన్‌ ప్రభుత్వం, ప్రజల వీరోచిత ప్రయత్నాలకు అండగా ఉంటాం. రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి ఉన్న అంతర్జాతీయ నిబంధనలపై రష్యా సైనిక చర్యను దాడిగా భావిస్తున్నాం. వాటిని రక్షించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఈ యుద్ధానికి రష్యానే బాధ్యత వహించేలా చేసి.. వ్యూహాత్మక తప్పిదంగా పుతిన్‌కు తెలిసొచ్చేలా చేస్తాం. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి రష్యాను ఏకాకిని చేశాం. రానున్న రోజుల్లో వీటిని కఠినంగా అమలు చేస్తాం” అని ఆ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. రష్యాకు చెందిన ఒలిగార్క్‌లు (శక్తిమంతమైన సంపన్నులు), కంపెనీలకు చెందిన ఆస్తులను వేటాడేందుకు టాస్క్‌ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసినట్లు అమెరికా ప్రకటించింది. రష్యన్ల యాట్లు, విలాసవంతమైన కార్లు, భవనాలు, గోల్డెన్‌ పాస్‌పోర్టులు, వారి పిల్లలు పశ్చిమ దేశాల కళాశాలల్లో చదవకుండా అడ్డుకొనేలా ఇది చర్యలు తీసుకొంటుంది. అమెరికా ఆంక్షలు పూర్తిగా, సమర్థంగా అమలయ్యేలా చూస్తుంది.


త్వరలో అమలు..
అనంతరం ఈ విషయాన్ని ఐరోపా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డేర్‌ లెయాన్‌ ట్విటర్‌లో ధ్రువీకరించారు. రష్యన్‌ దళాలు కీవ్‌తోపాటు ఇతర ఉక్రేనియన్‌ నగరాలపై దాడిని ఉధృతం చేస్తున్నందున అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, మన ఆర్థిక వ్యవస్థల నుంచి రష్యాను మరింత ఒంటరిని చేసి జరిమానాలు విధించడాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాం అని తెలిపారు. అదేసమయంలో ఈ చర్యలను త్వరలోనే అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు స్విప్ట్‌n ఇంటర్నేషనల్‌ పేమెంట్‌ వ్యవస్థ వెల్లడించింది. ”కొత్త చర్యల పరిధిలోకి వచ్చే సంస్థలను గుర్తించేందుకు ఐరోపా అధికారులతో కలిసి పనిచేస్తున్నాం. ఈ క్రమంలో చట్టబద్ధంగా నిర్వర్తించాల్సిన చర్యలను చేపట్టాం” అని పేర్కొంది.

మాస్కోతోపాటు ఇతరులపైనా ప్రభావం..
స్విప్ట్‌ బ్యాన్‌తో రష్యా ఆర్థిక వ్యవస్థ తక్షణమే ప్రభావం అవుతుంది. ఈ ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది. రష్యా చమురు, గ్యాస్‌ విక్రయిం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇది గణనీయంగా అడ్డుకొంటోంది. చమురు, గ్యాస్‌ సొమ్ము రష్యా ఆదాయాల్లో 40శాతం వరకు ఉంటుంది. గతంలో 2012లో ఇరాన్‌ను స్విప్ట్‌ నుంచి పక్కనపెట్టారు. దీంతో ఇరాన్‌ ఆర్థికంగా బాగా దెబ్బతింది. 50శాతం చమురు ఆదాయం, 30 శాతం విదేశీ వ్యాపారాన్ని కోల్పోయింది. స్విప్ట్‌ సేవల నుంచి రష్యా బ్యాంకులను దూరంగా పెట్టినట్లయితే ఆ దేశానికి సరకులను ఎగుమతి చేసే వారు తమకు రావాల్సిన నగదును పొందటానికి కష్టపడాల్సి వస్తుంది. రష్యా ప్రధాన ఎగుమతులైన చమురు, హజవాయువులను పొందే దేశాలకూ ఇబ్బందులు తప్పవు. 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి ఆంక్షలను రష్యా ఎదుర్కొంది. దాంతో మాస్కో సొంత సరిహద్దు నగదు బదిలీ వ్యవస్థను అభివృద్ధి చేసింది. అయితే, ఇది స్విఫ్ట్‌ మాదిరి అధునాతన, సురక్షిత వ్యవస్థ కాదు.

రష్యా రిజర్వులపై గురి
అంక్షల నుంచి తట్టుకొనేలా చేసేందుకు రష్యా పోగు చేసిన 600 బిలియన్‌ డాలర్లు విలువైన రిజర్వులను ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ వినియోగించకుండా చేయాలనే లక్ష్యంతో ఈ బ్యాన్‌ విధించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. దీనిపై ఐరోపా సమాఖ్య అధికారి ఒకరు మాట్లాడుతూ.. రష్యా సెంట్రల్‌ బ్యాంక్‌ వద్ద ఉన్న విదేశీ ఆస్తులను స్థానిక కరెన్సీ కోసం విక్రయించకుండా ఇది అడ్డుకొంటుందని పేర్కొన్నారు. దీంతోపాటు విదేశాల్లోని రష్యా రిజర్వులు సమర్థంగా స్తంభింపజేస్తుందని వెల్లడించారు. రూబుల్‌ పతనం సమయంలో వీటిని వాడే అవకశాలు తగ్గిపోతాయని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement