తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ జాతకాలు బాగున్నాయని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. ఉగాది సందర్భంగా విశాఖలో ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవని ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర అన్నారు. రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావిస్తున్నాను అని తెలిపారు. విశాఖ శారదాపీఠంలో ఇవాళ్టి నుంచి భగవంతుడ్ని, రాజశ్యామల ఆరాధనను విశేష అర్చనలు నిర్వహిస్తామన్నారు. ప్రజలు, పాలన బావుండాలి, పచ్చని పంట పొలాలతో రైతులు బావుండాలని దేవుడ్ని కోరుకుంటున్నానని చెప్పారు. ప్లవ నామ సంవత్సరంలో శుభాలు కలగాలని కోరుకుందామన్నారు. ఈ ఏడాది ఓ పెద్ద నేతకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని.. గ్రహాల అనుకూలత లేకున్నా తెలుగు రాష్ట్రాలకు మంచి జరుగుతుందని స్వరూపానందేంద్ర ఆకాంక్షించారు.
మరోవైపు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అర్చకులను సీఎం వైఎస్ జగన్ సన్మానించారు. కప్పగంతుల సుబ్బరామ సోమయాజుల శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. సంక్షేమం దిశగా సీఎం జగన్ పాలన ఉంటుందని శాస్త్రి తెలిపారు. విద్యా విధానాల్లో కొత్త మార్పులు వస్తాయన్నారు. కొత్త ఏడాదిలో సంక్షేమ పథకాలను సీఎం జగన్ సమర్ధవంతంగా అమలు చేస్తారని అన్నారు. ఈ ఏడాది రాజకీయంగానూ ఎన్నో విజయాలు సాధిస్తారని.. పేరు ప్రతిష్టలు రెట్టింపు అవుతాయన్నారు పండితులు. శ్రీ ప్లవనామ సంవత్సరంలో కూడా ఆంధ్ర ప్రదేశ్ పై వరుణుడి అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుందని.. ఊహించినట్టే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. పాడిపరిశ్రమ ఊహించని ఫలితాలు అందుకుంటాయన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది రైతులకు లాభదాయకంగా ఉంటుందని పండితులు చెప్పారు.