ఈత సరదా ప్రాణాలమీదకు తెస్తుంది. స్వర్ణముఖి నదిలో ఈత కొట్టడానికి వెళ్లిన విద్యార్థులు గల్లంతయ్యారు. నీటిలో కొట్టుకుపోతున్న నలుగురిలో ఒకరిని స్థానికులు కాపాడారు. కాగా మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ సంఘటన శ్రీకాళహస్తి రేణిగుంట మండలంలో జరిగింది. రేణిగుంట మండలం జీ పాళ్యం గ్రామం దళితవాడకు చెందిన.. తొమ్మిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు ఆదివారం కావడంతో ఆటవిడుపుగా ఈత కొట్టేందుకు వెళ్లారు. గ్రామానికి సమీపంలో స్వర్ణముఖీ నది వంక ప్రవహిస్తుండగా అందులో దిగారు. అయితే ఇటీవల వర్షాలకు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నలుగురు విద్యార్థులు నీటిలో గల్లంతయ్యారు.
ఇది గమనించిన గ్రామస్తులు ఒకరిని ప్రాణాలకు తెగించి కాపాడారు. నీటిలో గల్లంతవుతున్న నిక్షిత్ అనే విద్యార్థిని కాపడగా.. మిగతా ముగ్గురు గణేష్, ధోని, యుగంధర్ గల్లంతవడంతో.. వారి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ముగ్గురు విద్యార్థులు గల్లంతవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..