రష్యాపై చర్యల విషయంలో యూరోపియన్ యూనియన్ మరో అడుగు ముందుకేసింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్‌తో మార్స్‌కు ఉమ్మడి మిషన్ ఎక్సోమార్స్ ప్రయోగాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గత రెండు రోజులుగా మా సభ్య దేశాలు ఈఎస్‌ఏ అంతరిక్ష కార్యక్రమాలపై ఉక్రెయిన్ యుద్ధ ప్రభావాన్ని చర్చించాయి. సెప్టెంబర్‌లో చేపట్టాల్సిన ఎక్సోమార్స్ ప్రయోగాన్ని నిలిపివేయాలనే కఠిన నిర్ణయాన్ని ఆమోదించాయి అని పారిస్‌లోని ప్రధాన కార్యాలయ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ జోసెఫ్ అష్‌బాచెర్ ట్విట్టర్‌లో తెలియజేశారు.
రష్యా దురాక్రమణ కారణంగా ఉక్రెయిన్‌లో ప్రాణనష్టం, విషాదకరమైన పరిణామాల పట్ల విచారిస్తున్నాం. అంతరిక్ష ప్రయోగాల నేపథ్యంలో ఈఎస్‌ఏ దాని సభ్యదేశాలు రష్యాపై విధించిన ఆంక్షలమేరకు నడుచుకోనుందని చెప్పారు. ప్రస్తుతం ఎక్సోమార్స్ రోవర్ మిషన్‌లో రోస్కోస్మోస్‌తో కొనసాగుతున్న సహకారాన్ని కొనసాగించడం అసాధ్యం. దీని ప్రకారం సహకారాన్ని నిలిపివేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఈఎస్‌ఏ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించింది. రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణను చర్చించేందుకు అసాధారణ సెషన్ ఏర్పాటు చేయనున్నామని ఈఎస్‌ఎ ప్రకటన పేర్కొంది.