Saturday, November 23, 2024

బడ్జెట్‌ సెషన్‌ ముగిసే వరకు బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌.. నిరసనలకు పిలుపిచ్చిన బీజేపీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే బీజేపీ ఎమ్మెల్యేలకు షాక్‌ తగిలింది. సమావేశాలు ప్రారంభమైన నిమిషాల వ్యవథిలోనే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలపై బడ్జెట్‌ సెషన్‌ ముగిసే వరకు సస్పెన్షన్‌ వేటు పడింది. సోమవారం ఉదయం బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే ఆర్థికశాఖా మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి ప్రసంగాన్ని బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. బడ్జెట్‌ ప్రతులను చించేశారు. గవర్నర్‌ ప్రసంగం లేకుండా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించటంపై నిరసనకు దిగారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఈటలరాజేందర్‌, రాజాసింగ్‌,రఘునందన్‌రావు ను బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేయాలని శాసనసభా వ్యవహారాల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సభ ముందు తీర్మాణాన్ని ప్రతిపాదించారు. ఇందుకు ఆమోదం తెలిపిన స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బీజేపీ సభ్యులను సస్పెండ్‌ చేశారు. బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకు ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

అసెంబ్లీ ముందు ధర్నా.. అరెస్టు
సభ నుంచి సస్పెండ్‌ చేయటాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, రాజాసింగ్‌, నిరసిస్తూ అసెంబ్లీ గేట్‌ -14 ఎదుట ఆందోళనకు దిగారు. ఈటల రాజేందర్‌, రాజాసింగ్‌, రఘునందన్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వతీరును ఎండగట్టారు. దీంతో అసెంబ్లీ ఎదుట ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన పోలీసులు బొల్లారం పీఎస్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలిపినా అరెస్టు చేసిన పోలీసుల తీరుపై బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. కాగా, తమ పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌, అరెస్టును బీజేపీ నాయకత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. ప్రభుత్వం బీజేపీపై కక్ష గట్టినట్లుగా వ్యవహరిస్తోందని , సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలను అరెస్టు చేశారని భావిస్తోంది.

రాష్ట్ర చరిత్రలో చీకటి రోజు: ఎమ్మెల్యే రాజాసింగ్‌
తెలంగాణ చరిత్రలో సోమవారం చీకటి రోజు అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు అసెంబ్లీలో వ్యవహరిస్తే అన్యాయంగా బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారని మండిపడ్డారు. బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రాజాసింగ్‌, ఈటల రాజేందర్‌ను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. ఈ విషయమై ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వలేదని, హక్కులను హరించే అధికారం సీఎం కేసీఆర్‌కు ఎవరు ఇచ్చారు..? అని ప్రశ్నించారు. సభ్యుల హక్కులను కాపాడాల్సిన స్పీకర్‌ కూడా ఈ విషయంపై స్పందించకపోవటం దారుణమన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని, చివరకు అసెంబ్లీని కూడా పోలీసులతోనే నడుపుతున్నారని మండిపడ్డారు. నిరంకుశంగా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ రాజకీయాన్ని నడవనీయమని …కూకటివేళ్లతో పెకిలిస్తామని పేర్కొన్నారు. కాగా… బీజేపీ ఎమ్మెల్యేలను కుట్రపూరితంగా అసెంబ్లీ నుంచి నిరవధికంగా సస్పెండ్‌ చేయించారని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మల దగ్దానికి పిలుపునిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement