అస్సాం రాష్ట్రంలో రేప్ అండ్ మర్డర్‌కు గురైన ఓ 13 ఏళ్ల బాలిక కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో నిందితులకు రక్షణ కల్పించినందుకు ఐపీఎస్ ఆఫీసర్‌తోపాటు.. పోస్టుమార్టంలో తప్పుడు నివేదిక అందించిన ముగ్గురు ప్రభుత్వ డాక్టర్లను సీఐడీ ఇవ్వాల అరెస్టు చేసింది..
– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
దురంగ్ జిల్లాలోని ఓ ధనవంతుల ఇంట్లో పనిచేస్తున్న బాలిక జూన్‌లో తన యజమాని ఇంట్లోనే ఉరి వేసుకుని కనిపించింది. అయితే.. అది ఆత్మహత్య కాదని, రేప్ అండ్ మర్డర్‌గా ఆ తర్వాత జరిపిన ఎంక్వైరీలో తేలింది. దీంతో ఆ ఇంటి యజమానులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెన్షన్‌కు గురైన దర్రాంగ్ జిల్లా అడిషనల్ ఎస్పీ రూపమ్ ఫుకాన్ని ఇవ్వాల (మంగళవారం) సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.
ఇక.. మంగళ్‌దై సివిల్ హాస్పిటల్‌కు చెందిన ముగ్గురు డాక్టర్లు అరుణ్ చంద్ర దేకా, అజంతా బోర్డోలోయ్, అనుపమ్ శర్మ, బాధితురాలి మృతదేహానికి మొదటి పోస్ట్ మార్టం పరీక్ష నిర్వహించారు. ఆ పోస్టుమార్టంలో వారు తప్పుడు వివరాలు పొందుపరిచినట్టు సీఐడీ కనుగొంది. దీంతో సోమవారం అనేక కమీషన్లు, లోపాయికారి ఒప్పందం కోసం వారు ట్రై చేసినా విడిచిపెట్టలేదు. చివరికి ఇవ్వాల ఆ ముగ్గురు డాక్టర్లను అరెస్టు చేసినట్లు సీఐడీ తెలిపింది. కాగా, మృతదేహాన్ని వెలికితీసి రెండోసారి శవపరీక్ష నిర్వహించారు. అరెస్టయిన అదనపు ఎస్పీతోపాటు.. దర్రాంగ్‌లోని అప్పటి ఎస్పీల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి.
దరాంగ్ జిల్లా ధులా పోలీస్ స్టేషన్ పరిధిలోని యజమాని ఇంట్లో ఉరి వేసుకున్న యువతిని గుర్తించారు. ఆమె పనిచేసిన యజమాని కుటుంబాన్ని కూడా అప్పట్లోనే అరెస్టు చేశారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని సరిగ్గా దర్యాప్తు చేయడానికి ఇష్టపడలేదని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. ఇక.. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆగస్టు 12న సోనిత్‌పూర్ జిల్లాలో బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. వెంటనే దర్రాంగ్ ఎస్పీ రాజ్‌మోహన్ రే, అదనపు ఎస్పీ రూపమ్ ఫుకాన్, అప్పటి ధులా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అధికారి ఉత్పల్ బోరాలను సస్పెండ్ చేశారు. ఈ కేసులో ఉత్పల్ బోరాని సీఐడీ ఇంతకుముందే అరెస్ట్ చేసింది.