అనుమానిత ఉగ్రవాదిని బెంగళూరులో జాతీయ దర్యాప్తు సంస్థ శనివారం అరెస్ట్ చేసింది. అరెస్టయిన ఉగ్రవాది పేరు ఆరిఫ్. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేసేవాడు. ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) లో చేరేందుకు విదేశాలకు వెళ్లేందుకు యత్నిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.ఈయనను విచారిస్తున్న పోలీసులు.. ఉగ్రవాద దేశాల ఉద్దేశాలను మరింత రాబట్టేందుకు చూస్తున్నారు. ఆరిఫ్ గత రెండేండ్లుగా అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు ఎన్ఐఏ అనుమానిస్తున్నది. అతను ఐఎస్ఐఎస్లో చేరాలనుకున్నాడని, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మీదుగా సిరియాకు పారిపోయే పనిలో ఉన్నాడని సమాచారం.
ఆరిఫ్ ఒక రాడికల్. అయినప్పటికీ ఇంతవరకు ఆయన ఎలాంటి ఘటనలో ప్రమేయం లేదని ఎన్ఐఏ వర్గాలు చెప్తున్నాయి. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఇతగాడు ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్నాట్లు గుర్తించారు. విచారణ నిమిత్తం అతని ల్యాప్‌టాప్‌తోపాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. నిందితుడి కదలికలను పర్యవేక్షిస్తున్న ఎన్ఐఏ.. స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నరల్ సెక్యూరిటీ విభాగంతో కలిసి ఆపరేషన్ చేపట్టింది. వచ్చే నెలలో ఐసిస్‌లో కలిసేందుకు సిరియా వెళ్లున్నట్లు పక్కా సమాచారం అందడంతో బెంగళూరు నగరంలోని తానిసండ్ర మంజునాథ్ నగర్లో నివసిస్తున్న ఆరిఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు.