అమెరికాలోని క్యాలిఫోర్నియాలో జరిగిన కాల్పుల ఘటనలో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఆదివారం క్యాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్‌లోని మాంటెరీ పార్కులో చైనా కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు వేలాది మంది హాజరై వేడుకలు చేసుకుంటుండగా.. ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్ మెషీన్ చేత బట్టిన ఒక వ్యక్తి అక్కడివారిపై కాల్పులు జరిపాడు. గన్ మెషీన్ వరుసగా లోడ్ చేస్తూ కాల్పలుకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పది మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
ఘటన సమాచారం అందుకున్న భద్రతా దళాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా, కాల్పులకు పాల్పడ్డ నిందితుడి కోసం పోలీసులు గాలించారు. ఆ ప్రాంతం మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకుని గాలించారు. తనను భద్రతా బలగాలు చుట్టుముట్టినట్లు గుర్తించిన నిందితుడు గన్ మెషీన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిందితుడిని 72 సంవత్సరాల హు క్యాన్ ట్రాన్‌గా గుర్తించారు. అతడు ఒక వ్యాన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాన్ దగ్గరికి పోలీసులు వస్తుండటం గమనించి, అతడు తనను తాను కాల్చుకున్నట్లు పోలీసులు తెలిపారు.