ఒక వ్యక్తి పట్టుదలతో పని చేసుకుంటూ వెళ్తే ఏదైనా సాధించవచ్చు అనడానికి గాయని సుశీలమ్మే నిదర్శనమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చాలామంది ఇష్టమైన పని మొదలుపెట్టి మధ్యలో వదిలేస్తారు.. కొంతమంది మాత్రమే కొనసాగిస్తారు నిష్ణాతులుగా రాణిస్తారు.. అలాంటి అరుదైన వ్యక్తిత్వం సుశీలమ్మది అని కవిత కొనియాడారు. ఇవ్వాల (బుధవారం) రాత్రి రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం భాషాసాంస్కృతిక శాఖ సహకారంతో సీల్ వెల్ కార్పొరేషన్-శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, తిరుమల బ్యాంక్ ఆధ్వర్యంలో పి.సుశీలమ్మ పాటల ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రముఖ గాయని సుశీలమ్మకు జరిగిన పౌర సత్కారానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమయంలో ఎమ్మెల్సీ కవితతో కలిసి, సుశీలమ్మ బతుకమ్మ పాట పాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మహిళలందరికీ సుశీలమ్మ ఆదర్శమని అన్నారు. 50 వేల పాటలు పాడటం మాములు విషయం కాదని, అనేక భాషల్లో పాటలు పాడారని గుర్తు చేశారు. ఏ భాషలో పాడిన అక్కడి ప్రాంత ప్రజల అభిమానాన్ని చూరగొనడం ఆమె ప్రత్యేకత అని కవిత పేర్కొన్నారు. సుశీలమ్మ మన తెలుగు వారు కావడం గర్వకారణమని, దేవుడి మీద పాటలు పాడి ఆమె జీవితానికి సార్థకత చేకూరిందని అన్నారు. దేవుడు అంత మంచి గొంతు ఇచ్చినందుకు దేవుడిపై వేయి కి పైగా పాటలు పాడారు చాలా గొప్ప విషయమని, తెలుగు రాష్ట్రాల్లో శ్రీరస్తు శుభమస్తు పాట ఇప్పటికి వినిపిస్తుంటుందని కవిత సంతోషం వ్యక్తం చేశారు.