రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల సద్దుల చెరువును అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్‌తో కలసి ఆయన సద్దుల చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మినీ ట్యాంక్‌బండ్‌లో పర్యాటకుల విహారం కోసం త్వరలో బోట్ షికారును ప్రారంభించనున్నామని చెప్పారు. ఇప్పటికే టూరిజం బోట్‌లు పట్టణానికి చేరుకున్నాయన్నారు.
చిన్నారుల కోసం సృజనాత్మకతకు అద్దంపట్టే రీతిలో క్రీడా కేంద్రాలు, అంతర్జాతీయ స్థాయికనుగుణంగా నిర్మాణాలతో పాటు విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ముఖద్వార నిర్మాణాలు చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు. సద్దుల చెరువు మధ్యలో పుట్టిన రోజు, పెండ్లిరోజు వంటి శుభకార్యాలు జరుపుకోవడానికి మినీకృయిజ్ షిప్, ఫైబర్ జెట్‌లను ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. వాకర్స్ కోసం మెడిటేషన్ కేంద్రంతోపాటు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.