తెలంగాణ శాసనసభ ఎన్నికలకు మరో రెండేళ్లు గడువు ఉంది. అయినా అప్పుడే రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీతోపాటు విపక్షాలు పోటాపోటీగా జనంలోకి వెళ్తున్నాయి. ఎన్నికల్లో తమ పరిస్థితి ఏంటన్న దానిపై సర్వేలు చేయించుకుంటున్నాయి. వాటి ఫలితాల ఆధారంగా పార్టీ లైన్, వ్యూహాలను మార్చుకుంటూ జనాధరణ పొందేలా ప్లాన్ చేసుకుంటున్నాయి. అయితే.. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ సర్వేలో మాత్రం సంచలన విషయాలే వెలుగుచూశాయంటున్నారు ఆ పార్టీ లీడర్లు. ఈ సర్వే ఆ పార్టీ లీడర్లు, కేడర్‌లో జోష్ నింపేలా ఉందని సమాచారం. ఇంతకీ ఆ సర్వే ఏం చెబుతుందంటే..
తాజాగా ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందట. సర్వే ప్రకారం.. అదనంగా 12 సీట్లను గెలిస్తే సరిపోతుందని వెల్లడైనట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు 48 సీట్లు వస్తాయని సర్వేలో తేలిందట.. కాగా, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంచి ఊపుమీద ఉన్నట్టు రిపోర్టు చెబుతోంది. ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్‌కు జనంలో పట్టున్న నాయకులున్నారని, మెదక్‌లో కూడా పార్టీ బలంగానే ఉందని కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు. అంతేకాకుండా రెండుసార్లు కేసీఆర్ ప్రభుత్వ పాలన చూసిన ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ ఓ చాన్స్ ఇద్దామనే ఆలోచనలో ఉన్నట్టు సర్వే రిపోర్టు వెల్లడించినట్టు సమాచారం.
అయితే.. ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ బలంగా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటినీ ఢికొట్టే సత్తా ఉన్నట్టు ఆ పార్టీ లీడర్లు అంచనా వేసుకుంటున్నారు. పార్టీ యంత్రాంగం కాస్త గట్టిగా కృషి చేస్తే మరింత బలపడే చాన్స్ ఉందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. 119 నియోజకవర్గాలున్న తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకి అయినా 60 సీట్లు కావాలి. కాగా, కాంగ్రెస్ గెలుచుకుంటామన్న ధీమాతో ఉన్న 48 స్థానాలకు తోడు మరో 12 సీట్లు కైవసం చేసుకుంటే అధికారం చేజిక్కించుకోవడం ఖాయం అంటోంది సర్వే రిపోర్టు.
కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని, ఎన్నికల నాటికి ఇది కాంగ్రెస్‌కు అనుకూలంగా మారుతుందన్న అంచానల్లో ఆ పార్టీ నేతలున్నారు. అందుకని ఈజీగా మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకోవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ సర్వే ప్రకారం 48 సీట్లే వచ్చినా తమకే చాన్స్ ఉంటుందని కూడా అంచనాలు వేసుకుంటున్నారు. ఎంఐఎం పార్టీకి వచ్చే దాదాపు 9 సీట్లు, బీఎస్పీ సహా ఇతరులు చీల్చుకునే సీట్లతో వారి మద్దతు సంపాదించి గద్దెనెక్కడం ఖాయం అంటూ ఇప్పుడే సంబురాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. అట్లయితే రానున్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సీఎం కావడం ఖాయమే అంటూ.. విజయావకాశాలను అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..