నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు కేసులో నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం మధ్యహ్నం 12 గంటలకు ఈ కేసును విచారించనుంది. రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన రఘురామకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్య పరీక్షల నివేదికను తమకు అందించాలని ఈ నెల 17న సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకు సంబంధించిన నివేదిక ఇప్పటికే కోర్టుకు చేరింది.
మరోవైపు, బెయిలు కోసం రఘురామ పెట్టుకున్న స్పెషల్ లీవ్ పిటిషన్‌కు కౌంటర్‌గా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ కూడా పరిశీలనలో ఉంది. గురువారం జరిగిన విచారణలో రఘురామ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. రఘురామ రాజు తన ప్రసంగాల్లో ఎక్కడా హింసను రెచ్చగొట్టలేదని చెప్పారు. తన ప్రాణాలకు ముప్పు ఉందన్న ఉద్దేశంతో ఇప్పటికే వై సెక్యూరిటీని కూడా పొందారని కోర్టుకు తెలిపారు. కాబట్టి ఆయనకు బెయిలు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. రఘురామ పిటిషన్‌కు జవాబిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నేటి వరకు వాయిదా కోరింది. ఈ నేపథ్యంలో నిన్న కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ప్రభుత్వం తన చర్యను సమర్థించుకుంది.
తన తండ్రి అక్రమ అరెస్టు, కస్టడీలో పోలీసులు పెట్టిన హింసపై సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు జరిపించాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కుమారుడు భరత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు పర్యవేక్షణలో ఈ విచారణ జరిపించాలంటూ గురువారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. రఘురామరాజును కస్టడీలో వేధించారని.. అమానుషంగా, చట్టవిరుద్ధంగా తీవ్రంగా హింసించారని భరత్ ఆరోపించారు. అరెస్టు చేసిన తీరును కూడా ఆక్షేపించారు. పిటిషన్లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి, మంగళగిరి పోలీస్ స్టేషన్ హౌజ్ అధికారి (ఎస్‌హెచ్‌వో), సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్ కుమార్, సీఐడీ అదనపు ఎస్పీ ఆర్ విజయ పాల్‌ను ప్రతివాదులుగా చేర్చారు.
ఇదీ చదవండి: 30 శాతం పతనమైన బిట్ కాయిన్..కారణం చైనా!