– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
బ్యాలెట్‌లు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)ల నుంచి పార్టీ గుర్తులను తొలగించి, అభ్యర్థుల వయస్సు, విద్యార్హతలు, ఫొటోలను పెట్టేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. ఇట్లాంటి చర్యతో ఓటర్లు ఓటు వేయడానికి.. మంచి అభ్యర్థిని ఎన్నుకోవడానికి చాన్స్ ఉంటుందని, నిజాయితీ గల అభ్యర్థులకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగపడుతుందని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. అంతేకాకుండా టికెట్ పంపిణీలో రాజకీయ పార్టీ అధిపతుల నియంతృత్వాన్ని నియంత్రించడానికి కూడా ఇది సహాయపడుతుందని అభ్యర్ధనలో పేర్కొన్నారు. కాగా, సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన అక్టోబర్ 31 నాటి కాజ్ లిస్ట్ ప్రకారం.. ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ యు యు లలిత్, జస్టిస్ ఎస్ ఆర్ భట్, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఈవీఎంలపై పార్టీ చిహ్నాలను ఉపయోగించడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ ఉల్లంఘన అని ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌లో కూడా పేర్కొన్నారు. న్యాయవాది అశ్వనీ కుమార్ దూబే దాఖలు చేసిన పిటిషన్‌లో రాజకీయాలలో అవినీతి, నేరాలను తగ్గించేందుకు ఉత్తమ పరిష్కారంగా బ్యాలెట్, ఈవీఎంలపై రాజకీయ పార్టీల చిహ్నాల స్థానంలో అభ్యర్థుల పేరు, వయస్సు, విద్యార్హత.. ఫొటోగ్రాఫ్‌లను ఉంచడమే సరైన పరిష్కారమని తెలిపారు.
అయితే.. ఎన్నికల సంస్కరణల్లో పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) చేసిన అధ్యయనాన్ని ప్రస్తావిస్తూ.. 539 మంది ఎంపీలలో 233 మంది (43 శాతం) పై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. 2014 ఎన్నికల తర్వాత విశ్లేషించిన 542 మంది విజేతల్లో 185 మంది (34 శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నాయని, 2009 లోక్‌సభ ఎన్నికల తర్వాత విశ్లేషించిన 543 మంది విజేతల్లో 162 మంది (30 శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆ పిటిషన్‌తో జత చేశారు.