– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
వన్ నేషన్ – వన్ పెన్షన్‌ని నాలుగు వాయిదాల్లో చెల్లించాలని జనవరి 20న జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని రక్షణ మంత్రిత్వ శాఖను సుప్రీంకోర్టు ఇవ్వాల (సోమవారం) ఆదేశించింది. రక్షణ మంత్రిత్వ శాఖ జనవరి 20న ఇచ్చిన సమాచారం తమ తీర్పునకు పూర్తిగా విరుద్ధమని, నాలుగు విడతల్లో బకాయిలు చెల్లిస్తామని ఏకపక్షంగా చెప్పలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, రక్షణ మంత్రిత్వశాఖ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోలేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. మాజీ సైనికులకు బకాయిలు ఉన్న వన్ ర్యాంక్ – వన్ పెన్షన్ బకాయిలను ఒకే విడుతలో చెల్లించామని, అయితే పూర్తిగా చెల్లించేందుకు మరికొంత సమయం కావాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకరమణి న్యాయస్థానాన్ని కోరారు.
దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు బకాయిల చెల్లింపుపై తొలుత జారీచేసిన జనవరి 20 నాటి నోటిఫికేషన్‌ను ఉప సంహరించుకోవాలని, ఆ తర్వాత దరఖాస్తును సకాలంలో పరిశీలిస్తామని చెప్పింది. అలాగే చెల్లింపు ప్రక్రియ కోసం అనుసరించాల్సిన పద్ధతులు, ప్రాధాన్యానికి సంబంధించి వివరాల నోట్‌ను సిద్ధం చేయాలని ఆదేశించింది. ఏదో ఒక రకమైన వర్గీకరణ ఉండాలని, వృద్ధులకు మొదట బకాయిలు చెల్లించాలని తాము కోరుకుంటున్నామని ధర్మాసనం పేర్కొంది.